Saturday, November 23, 2024

 జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు

- Advertisement -
- Advertisement -

Jagan-And-Chandra-Babu

నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర, అనుభవం కల్గిన చంద్రబాబు నాయుడికి కూడా ఆ పీఠం అంత సులువుగా దక్కలేదు. ఎన్నికల క్షేత్రంలో తనకు తోడుగా బిజెపి పార్టీ, జనసేన పార్టీల్ని కలుపుకోవడంవల్లే చంద్రబాబుకు విజయం దక్కింది. ఇది నిర్వివాద అంశం జగమెరిగిన సత్యం. గద్దెనెక్కిన చంద్రబాబు వైఎస్‌ఆర్ పార్టీని భూస్థాపితం చేయాలని అన్ని శక్తుల్ని దొడ్డాడు.

చివరికి వైసిపికి చెందిన 23 మంది శాసనసభ్యుల్ని కూడా దుర్మార్గంగా తన పార్టీలోకి లాగేసుకొన్నాడు. ముగ్గురు పార్లమెంటు సభ్యుల్ని కూడా లాగేసుకొన్నాడు. చివరికి శాసనసభ సమావేశాల కాలంలో కూడా జగన్ ను తెలుగుదేశం పార్టీ సభ్యులు నీఛాతినీచంగా విమర్శించడంతో జగన్ చివరికి అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించి, పాదయాత్ర పేరున జనం మధ్య కెళ్ళిపోయాడు. ఆ పాదయాత్ర, ఆ జనంతో మమేకం కావడం, రెండూ కలిపి 2019 ఎన్నికల్లో జగన్‌కు గెలుపును ప్రసాధించింది. గెలుపు కూడా ఎవరూ ఊహించని గెలుపు. 151 స్థానాల్లో విజయ భేరి మోగించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగాడు. ఆ నాటి నుంచి ఈనాటి వరకు జగన్ ప్రజారంజక పాలన సాగిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్నాడు. మాటతప్పను మడమతిప్పను అన్నది ఆయన సిద్ధాంతం.

అందుకనుగుణంగానే ఆయన ఈ రోజు ప్రతి అడుగు వేస్తున్నాడు. ఆనాటి ప్రమాణ స్వీకార సభలో జగన్ మాట్లాడుతూ ‘ఎల్లో మీడియాపై’ మన యుద్ధం కొనసాగుతూనే వుంటుంది అని ఘాటుగా కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ పై విమర్శలు కురిపించాడు. ఈ రెండేళ్ళ కాలంలో కూడా తనకు, ఎల్లో మీడియాకు మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే వుంది. మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి దుష్పరిణామాల్ని మనం చూసివుండం. ఇక చంద్రబాబు నాయుడు 2014లో 117 స్థానాల్లో గెలుపొందగా, 2019లో 23 స్థానాల్లో మాత్రమే గెలుపొందాడు. జగన్ గెలుపు ఓ చరిత్ర. చిన్న వయస్కుడైనా ప్రజలందరి హృదయాల్ని సునాయాసంగా గెల్చుకోగలిగాడు. నాటి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతూనే వుంది. నవరత్నాల పేరున ఆయన ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నింటిలో 94.5 శాతం రెండవ ఏడాదికే పూర్తి చేశానని జగన్ ప్రకటించడం చాలా గర్వకారణం. భారత రాజకీయాల్లో ఇంత వరకు ఏ పార్టీ కూడా ఇలా చేసి వుండదు.

గద్దె నెక్కాక మేనిఫెస్టో కాపీలు అటకెక్కిస్తారు. కానీ జగన్ అందరిలాంటి వాడు కాదు. అనుకొన్నిది, హామీ ఇచ్చినది ఎలాంటిదైనా ఆమలు జరిపి తీరాలన్నదే జగన్ ధ్యేయం. ప్రజల నాడి, ప్రజల హృదయం బాగా చదివిన వాడు జగన్. రెండేళ్ళ కాలంలో అన్ని వర్గాల ప్రజలకు తగిన పథకాల్ని రూపొందించి అమలు చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం ఆయ్యాక షెడ్యుల్డ్ కులాల నుంచి, షెడ్యుల్డ్ తెగల నుంచి, వెనుకబడిన వర్గాల నుంచి, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా నియమించి బడుగు, బలహీన వర్గాలపట్ల తన హృదయం ఏమిటో చెప్పకనే చెప్పేశాడు. ఖర్చు చేసిన నిధుల్లో 86 శాతం సంక్షేమ రంగానికే వెచ్చించాడు. రెండేళ్ళ కాలంలో 1.31 లక్షల కోట్లు రూ.లు వివిధ పథకాల క్రింద ప్రజలకు డైరెక్టుగా అందచేశారు. ఇందులో ప్రత్యక్షంగా 95,528 కోట్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేయగా, 36,197 కోట్ల రూ. లు మరికొన్ని పథకాలు ద్వారా పరోక్షంగా అందచేశారు.

జగన్ అమలు చేస్తున్న అనేక పథకాలు దేశానికే ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతు భరోసా, వాహన మిత్ర, నేతన్న హస్తం, వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్‌ఆర్ లా నేస్తం, జగనన్న జీవక్రాంతి, వైఎస్‌ఆర్ పెళ్ళి కానుక, వైఎస్‌ఆర్ బీమా, జగనన్న చేదోడు, నాడునేడు, స్పందన. జలకళ, జగనన్న అమ్మవొడి, జగనన్న విద్యా దీవెనా, జగనన్న వసతి దీవేన, జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యాకానుక ఇవి కొన్ని ప్రధాన పథకాలు. పేద ప్రజల మెడల్లో హారాలు. ఇన్ని పథకాలలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మనసులు దోచుకొన్న జగన్ రెండేళ్ళు పూర్తి చేసిన సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో మరింత మంచి చేసేందుకు తగిన శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఎంతో వినమత్రతో చెప్పారు. జగన్‌ని కొందరు మహిళా పక్షపాతి అంటారు. మరి కొందరు రైతు బాంధవుడంటారు. మరి కొంత మంది పేదల దేవుడు అని పిలుస్తారు. ఇలా అన్ని వర్గాల మన్ననలను అందుకొంటున్న జన విజేత జగన్. ఆయన నిత్య అన్వేషి, నిత్య శోధకుడు. ప్రజలకు ఇంకా మంచి చేయాలన్న తపనే ఆయన శోధనకు సబ్జెక్ట్. ప్రజలకు మంచి చేయాలన్న నిజమైన తపన వున్న నాయకులకు ఇలాంటి ఎన్నో పథకాలు స్పురణ కొస్తుంటాయి. ప్రజల మనసుల్ని గెలవగల్గితే ఎన్నికల్లో గెలవడం చాలా సులభం. ఆ గెలుపు మార్గాలే జగన్ పథకాలు.

జగన్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా చెప్పబడే పథకం ‘విలేజ్ సెక్రటేరియట్’. ప్రతి గ్రామానికి ఒక సెక్రటేరియట్. ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఇదో అద్భుత పథకం. పాలనను ప్రజల ముంగిటకే తీసుకొచ్చిన పథకం. గ్రామ సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించబడుతున్నాయి. కేస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, అడంగళ్ అంటూ ఎక్కడెక్కడికో కాళ్ళరిగేలా పనిలేదు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఇచ్చే డబ్బులన్నీ నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోనే పడిపోతున్నాయి. దళారులు, మధ్య వర్తులు, లంచాలు ఏమీ లేదు. జగన్ క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కితే చాలు డబ్బులన్నీ వారి వారి అకౌంట్‌లో జమ చేయ బడతాయి. ఇక పెన్షన్లయితే నెల అయ్యే సరికి టంచనుగా నిద్ర లేచేసరికి లబ్ధిదారుల ఇంటి ముంగిటకే వాలంటీర్లు డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ భారత దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇప్పటి వరకు తట్టక పోవడం మన దేశ దురదృష్టం. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోను ఇలాంటి వ్యవస్థను ఏర్పరచగల్గితే ప్రజలకు ఎంత హాయో! కరోనా మహమ్మారి కష్టకాలంలో గత ఏడాది వాలంటీర్లు చేసిన కృషి చిరస్మరణీయం. చిన్న వారైనా వారికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఈ వ్యవస్థ కోసం దాదాపు 6 లక్షల మందిని కొత్తగా వుద్యోగాల్లో తీసుకొన్నారు. గాంధీ జీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ పథకం గుర్తుకు తెస్తున్నది.

ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పథకాల్ని చూసి అమలు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు. గ్రామాల్లో కొత్త శకం ఆరంభమైంది. గ్రామీణల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. జగన్ ది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయన ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోడు. తన పని తాను చేసుకెళ్తూ వుంటాడు. ఆఫీసర్లను, నాయకుల్ని ‘అన్నా’ అని ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తాడు. మీడియాకు ఎప్పటికీ దొరకడు. ప్రచార వ్యామోహం లేదు. అతి సింపుల్‌గా, నిరాడంబరంగా వుంటాడు. మీటింగ్లు కూడా గంటల కొద్దీ కాకుండా క్లుప్తంగా ముగిస్తుంటాడు. గత పాలకుల్లాగా అధికార్లపైన, పార్టీ నాయకులపైన సిఎం ‘ఆగ్రహం’ అంటూ ఉత్తుత్తి లీకు ఇచ్చే అలవాటు, జిమ్మిక్కులు ఆయనకు లేవు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విదేశాలకు టూర్లు చేయడం, పారిశ్రామిక సదస్సుల పేరిట అధికార దుర్వినియోగం చేయడం జగనకు గిట్టవు.

నాడునేడు అని ఆయన ప్రవేశపెట్టిన పథకం కూడా మహత్తరమైంది. దీని ద్వారా రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్పిటల్స్ రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతున్నాయి. హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ కొర్పొరేట్ స్థాయిలో అలరారబోతున్నాయి. రానున్న రోజుల్లో ధనవంతులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకు పంపడానికే ఇష్ట పడుతారు. విద్యారంగంలో ప్రైవేట్ వ్యక్తుల గుత్తాధిపత్యానికి తెరపడ నుంది. విద్య, వైద్య రంగాలలో పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి. పాఠశాలల్లో పిల్లలకు ఏ రోజు ఏం ఫలహారం పెట్టాలన్న మెనూ కూడా జగన్ నిర్ణయించడం పిల్లల పట్ల, వారి చదువుల పట్ల ఆయన కెంత ప్రేమో తెలుస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో 5 అతి పెద్ద హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి నిన్ననే శాంకుస్థాపన కూడా చేయడం జరిగింది. గత ఏడాది జూలై 1వ తారీఖున 1088 అంబులెన్లు కొని శభాష్ అని పించుకొన్నాడు. ఇలా ఒకటేమిటి, విభిన్న పథకాల్ని ప్రవేశపెట్టి తన కంటూ ఓ ముద్ర వేసుకొంటున్నాడు.

జగన్ రెండేళ్ళ పాలనలో అభివృద్ధికి ఆశయాలకు గండి కొట్టింది కరోనా మహమ్మారి. పాలనను, ఆర్థిక వ్యవస్థను కుదేల్ మనిపించింది. ప్రజల జీవితాలు అతలా కుతలం అయ్యాయి. దాదాపు ఏడాది నుండి ఈ కరోనా మనల్ని భయ భ్రాంతులకు గురి చేస్తున్నది. దీనిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జగన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. బెడ్స్ సంఖ్య పెంచారు. వెంటిలేర్లు, ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లను భారీ ఎత్తున్న సమకూర్చారు. ఆక్సిజన్ సకాలంలో అందక తిరుపతి రుయా హాస్పిటల్‌లో చనిపోయిన 11 మందికి 10 లక్షల రూ. ఆర్థిక సహాయాన్ని అందజేయడమే కాకుండా ఆక్సిజన్‌ను భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్‌కు తెప్పించిన వ్యక్తి జగన్. ప్రతిరోజు క్రమం తప్పక కరోనా పై రివ్యూ చేస్తున్నాడు. కరోనా వల్ల తల్లి, తండ్రుల్ని కోల్పోయిన అనాథలుగా మిగిలిన పిల్లల భవిష్యత్తు కోసం 10 లక్షల రూ. లు ఫిక్సిడ్ డిపాజిట్ చేయడం కూడా భారతదేశంలో జగన్ వొక్కరే. అంత్యక్రియలకు, కోలుకొన్న తర్వాత దారి ఖర్చులకు కూడా డబ్బులిస్తున్న ఘనత జగన్ దే. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ జగన్ ఆపన్న హస్తం అందిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నాడు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ఆర్థిక లోటు వచ్చినా తన పథకాల్ని మాత్రం ఆగకుండా చూస్తున్న వ్యక్తి జగన్ జగన్‌పై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అందులో మొదటిది ఆయన జనాల్ని కలవడు అన్న అభియోగం, తండ్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రతిరోజు ఉదయం విధిగా సందర్శకుల్ని కలిసేవారు. జగన్ కూడా దీనిని ఆచరిస్తే సంతోషం. మరో ఆరోపణ కక్ష సాధింపు. ప్రత్యర్థులపై కక్ష సాధిస్తున్నాడన్నది. ఈ విషయంలో కాస్తా ఆలోచించి తప్పులుంటే దిద్దుకోవాలి.

ఇక పోలీసు వ్యవస్థ పాలకులకు గులాంగిరీ చేస్తున్నారన్న ఆరోపణ. ఇది ప్రధానంగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణ. ఇది కరెక్టుకాదు. పోలీసు వ్యవస్థ నాడూ, నేడూ వొకేలా వుంటున్నది. ఆనాడు జగన్ విశాఖ వెళ్లి స్పెషల్ స్టేటస్ ఆందోళన సందర్బంగా క్యాండిల్ ర్యాలీకి హాజరవ్వాలన్న తలంపుతో విశాఖ ఏయిర్ పోర్ట్‌లో దిగగానే పోలీసులు అడ్డుకొని ఆయన్ని తిరిగి హైద్రాబాద్‌కు పంపేశారు. మొన్న తిరుపతిలో కూడా పోలీసులు చంద్రబాబును అదే రీతిలో హైద్రాబాదు పంపేశారు. ఆనాడు రోజా స్పీకర్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానంపై విజయవాడ వస్తే ఆమెనూ పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి వెనక్కి పంపేశారు. పోలీసులు ఎవరి పనివారు చేసుకెళ్తుంటారు. పోలీసుల్ని నీచాతినీచంగా చిత్రీకరించడం సబబు కాదు ఏ వ్యవస్థలోనైనా కొన్ని స్వల్ప లోపాలుండడం సహజం. జగన్ ఎవరి సూచలు తీసుకోడు అన్నది మరో ఆరోపణ. ఏ నాయకుడికైనా ప్రజాభిప్రాయం అన్నది దిక్సూచి లాంటిది. ఫీడ్ బ్యాక్‌తో లోపాల్ని సరిదిద్దుకోవచ్చు.

లేదా మరింత పకడ్బందీగా పథకాల్ని అమలు చేయవచ్చు. నాకు తెలిసి ఈ పనిని ఇంటిలిజెన్స్ వ్యవస్థ నిర్వహిస్తుంటుంది. జగన్ దగ్గరున్న న్యాయశాఖ కూడా సవర్థవంతంగా లేదని అందువల్లే కోర్టులల్లో అన్ని కేసులు వీగిపోతున్నాయని కొందరి విశ్లేషణ. దీనిని కూడా పునఃపరిశీలించాలి. ఇలా ఒకటి, అర ఆరోపజణలు రావడం ఏ ప్రభుత్వానికైనా సహజం. రెండేళ్ళకే జగన్ పాలనను బేరీజు వేయడం కూడా తగదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు ఆయనకు వొక సవాల్ లాగా మిగిలేవుంది. ఆయనకింకా మూడేళ్ళ సమయముంది. ఈ మూడేళ్ళు కూడా ప్రజల మెప్పును పొందగలిగితే ఆయన కిక తిరుగే లేదు. ఇక చంద్రబాబు నాయుడు గూర్చి చంద్రబాబు బాగా తెలివైన వాడు. సామర్థ్యం, చాకచక్యం పుష్కలంగా వున్న వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో చాలా సీనియర్. ఎంతో అనుభవం, పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి. ఇంత గొప్పవాడైనా 2019లోనూ, ఇప్పుడూ ప్రజల నాడి తెలుసుకోలేక భంగపడుతున్నాడు. పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ బండికి చక్రాలు వంటివి.

ప్రతిపక్షం అంటే పాలక పక్షం చేసే ప్రతి మంచి పనిని కూడా విమర్శించడం కాదు. ప్రభుత్వం తప్పుదారిన వెళ్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొంటుంటే ప్రతిపక్షం కీలక పాత్ర వహించాల్సి వుంటుంది. 14 సం॥లు ముఖ్యమంత్రిగా, 14 సం॥లు ప్రతిపక్ష నాయకుడిగా రాణించిన చంద్రబాబు ఇప్పు డు ఎందుకనో తన పాత్ర రక్తి కట్టించలేకపోతున్నాడు. ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియడం లేదు. జగన్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కాలం దుర్వినియోగం చేసుకొంటున్నాడు.

కరకట్టపై తానుంటున్న అక్రమ నిర్మాణం కూల్చివేత ప్రయత్నం నుంచి నేటి కరోనా కట్టడి వరకు చంద్రబాబు పాత్ర ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఒక మీడియా వర్గాన్ని తన గుప్పెట్లో వుంచుకొని రోజూవారీ జగన్‌పై విషం కక్కడం చంద్రబాబు చేస్తున్న పని. ప్రతిపక్షం అంటే విమర్శించే పక్షం అని చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకొంటే కష్టం. అసలు జగన్ పాలనలోని లోపాల్ని హేతుబద్ధంగా ఎత్తిచూపగల్గాలి. అలా కాకుండా నోటికి ఏది పడితే అది తిట్టడం మంచిది కాదు. జగన్ ని 2019 లోనూ. 2021లోనూ అవినీతి పరుడిగా చంద్రబాబు అభివర్ణిస్తూనే వున్నాడు. దాని వల్ల ఆయనకు, ఆయన పార్టీకి నష్టం తప్ప లాభం చేకూరడం లేదు. అది ఆయన ఇప్పటికే గ్రహించకపోవడం చాలా దురదృష్టకరం. ఏ పార్టీకైనా గెలుపు, ఓటమిలపై తీర్పు నిచ్చేది ప్రజలే! మరి ఆ ప్రజల మనసులు గెలవకుండా ఉత్తుత్తి, పసలేని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ, నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు ‘ఛీ’ కొట్టడం జరిగింది. అలాగే జగన్‌ని బిసి వ్యతిరేకి అని ముద్రవేసేందుకు కూడా విఫల ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఇందులోని హేతుబద్ధతను చూస్తే జగన్ కొత్తగా 54 బిసి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రాజ్యాంగ పదవుల్లో కూడా 50 శాతం బిసిలకు రిజర్వ్ చేస్తే బిసిలు ఎవరి పక్షం వహిస్తారు? అనుభవమున్న నాయకుడు అలాంటి ఆరోపణలు చేసే ముందు బాగా ఆలోచించాలి. బిసి కార్పొరేషన్లు ఏర్పాటుపై కాకుండా వాటికి కేటాయించిన నిధులపై విమర్శలు చేస్తే సహేతుకంగా వుంటుంది. మొన్నకు మొన్న 4 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు జరిగితే ఇద్దరు బిసిల్ని జగన్ ఎంపిక చేశారు.
20142019 మధ్య చంద్రబాబు ఇలాంటి పని ఎందుకు చేయలేకపోయాడు? తనలోని, తన పార్టీలోని విధానాలను వాటి లోపాల్ని సమీక్షించుకోక పరనిందతో కాలం గడిపితే ప్రజలు విశ్వసించరు. చంద్రబాబులో మార్పు రావాలి! ధోరణిలో మార్పు రావాలి! స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి! అలా కాకుండా జగన్ పై రాళ్ళు వేయడమే పనిగా పెట్టుకోకుడదు ఎలాగైనా ప్రజల అవసరాల్ని, ప్రజల మనసుల్ని తెలుసుకోగల్గాలి. పసలేని ఆరోపనణలు లాభం చే కూర్చవు. విమర్శలు నిర్మాణాత్మకంగా వుండాలి. అత్యధిక మెజారిటీలో నెగ్గిన జగనను ‘ఫేక్ సిఎం అనడం చాలా తప్పు. నిన్న జరిగిన మహానాడులో ఏ కొత్తదనం చూపించలేక పోవడమే కాకుండా విమర్శలతో కూడిన తీర్మానాలే అధికంగా చేశారు.

ప్రజలు చాలా చైతన్య వంతులైనారు. ఎప్పటిలా అపద్ధాల్ని గంటల కొద్దీ వల్లె వస్తే ప్రజలు ఓట్లు వేయరు. విశాఖ ఉక్కుగూర్చి. కరోనా సెకండ్ వేవ్‌లో మోడీ ప్రభుత్వ వైఫల్యం గూర్చి ఎందుకు తీర్మానం చేయలేదని రాజకీయ విశ్లేషకుల విమర్శలకు ఏం సమాధానంచెప్తారు. ఇందులో అందరికీ కన్పించేది బిజెపికి దగ్గరవడానికి చంద్రబాబు పడే తాపత్రయమే కన్పిస్తున్నది. మోడీ అంటే ఎందుకంత భయమో ఎవరికీ అర్థం కావడంలేదు.

రఘురామ డ్రామాని కూడా చంద్రబాబే నడిపాడన్నది అందరికీ తెలిసిందే. ఆ ఉదంతం వల్ల తెలుగు దేశానికే వచ్చిన లాభం సున్న. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనా ధోరణిని పునః సమీక్ష చేసుకోవాలి. ఇంకా మూడేళ్ళ వ్యవధి వుంది. జగన్ నిజంగా తప్పులు చేస్తే ప్రజలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చేస్తారు. బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. అలాంటిది తెలుగుదేశమే వీక్ అయిపోతే చాలా కష్టం. రాష్ట్రానికి నష్టం కూడా. జగన్ పాలనలోని లోపాల్ని ఆధారాలతో సహా బయటపెట్టగల్గితే అందరూ హర్షిస్తారు. మీడియాను నమ్ముకొని గాలిలో విహరించాలనుకొంటే క్రిందపడి నడుములు విరగడం ఖాయం. ఆనాడు కెసిఆర్ ప్రభుత్వం పై చంద్రబాబు చేయాలనుకొన్న కుట్ర బట్టబయలు కావడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. భజనపరుల్ని, తెలివి తక్కువ సలహాలిచ్చే వారిని, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారిని ప్రక్కన పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకం. మారాలి బాబు పూర్తిగా మారాలి, మారి పార్టీని బ్రతికించుకోవాలి. పోరాటం పదునైన ఆయుధాలతో చేయాలే కాని చెక్క ఖడ్గాలతో చేయకూడదు. అనుభవాన్ని అధికారాని కోసం కాకుండా రాష్ట్రాభివృద్ధికి వినియోగించడిం చాలా మంచిది. అప్పుడే ప్రజల మనసులు గెలవగలరు! తస్మాత్ జాగ్రత్త! వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అప్పడే ఆ పార్టీకి తెలుగు నేలలో జీవం వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News