దేశాన్ని మృత్యుభయంలో ముంచి 130 కోట్ల పైచిలుకు జనాభాలో ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కొవిడ్ 19 రెండవ విజృంభణను ఎదుర్కోడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంలోని లోపాలను సుప్రీంకోర్టు సూటిగా ఎత్తి చూపి పరంపరగా ప్రశ్నలను సంధించడం ఇది మొదటిసారి కాదు. 18-44 ఏళ్ల మధ్యలోని అత్యధిక శాతం ప్రజలకు టీకాలు కొని వేయించే బాధ్యతను రాష్ట్రాల మీదికి నెట్టివేయడాన్ని, వ్యాక్సిన్లకు వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని అత్యున్నత న్యాయస్థానం మరోసారి గట్టిగా నిలదీసింది. ఇవే ప్రశ్నలను ఇదే ధర్మాసనం గతంలో రెండు సార్లు కేంద్రంపై ఎక్కుపెట్టింది. అయినా కేంద్ర పాలకుల్లో ఏ మాత్రం కదలిక, మార్పు రాకపోయే సరికి సోమవారం నాడు మరొక్కసారి ఉతికి ఆరేసిందని భావించాలి.బాలల ప్రాణాల మీదకు విరుచుకుపడనున్నదని భావిస్తున్న కొవిడ్ 19 మూడో కెరటాన్ని ఎదుర్కోడానికి ఎటువంటి సన్నాహాలు చేస్తున్నారని కేంద్రాన్ని ధర్మాసనం అడిగింది. ఆన్‌లైన్ సమాచార వ్యవస్థతో కూడిన ‘డిజిటల్ ఇండియా’ పటంలో బొత్తిగా చోటు లభించని గ్రామీణ ప్రజలను టీకా కోసం యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలని ఆదేశించడం సబబేనా అని కూడా ప్రశ్నించింది.
క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, నేలకు చెవి ఆనించి నిర్ణయాలు తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండనక్కర లేదా అని న్యాయమూర్తులు డి.వై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర రావు, ఎస్ రవీంద్ర భట్‌ల ధర్మాసనం ప్రభుత్వంపై కొరడా ఝళిపించింది. 45 ఏళ్లు, ఆపైపడిన వారికి టీకాల బాధ్యతను స్వీకరించిన కేంద్రం అత్యధిక సంఖ్యాకులుండే 18-44 ఏళ్ల వయసులోని వారి సంగతిని రాష్ట్రాలకు వదిలిపెట్టడం ప్రజల ప్రజారోగ్య హక్కుకు భంగకరమని విశదం చేసింది. పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు టీకాల కోసం అంతర్జాతీయ టెండర్లను పిలుస్తున్నాయంటే దేశ పాలనా బాధ్యత వహిస్తున్న కేంద్రం తన కర్తవ్యాన్ని గుర్తించకపోడంగానే భావించవలసి వస్తుందని అభిప్రాయపడింది. దేశానికి అవసరమయ్యే టీకాలలో సగ భాగాన్ని ఒక్కొక్క డోసు రూ. 150 కే కేంద్రం కొంటున్నప్పుడు, రాష్ట్రాలు రూ. 300 నుంచి రూ. 600 వరకు చెల్లించుకోవలసి రావడం అక్రమమని వ్యాఖ్యానించింది. అంతేకాక రెండు దేశీయ టీకాలైన కొవిషీల్డ్, కొవాగ్జిన్లకు వేర్వేరు ధరలు నిర్ణయించడాన్నీ ప్రశ్నించింది. వ్యాక్సిన్ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, కొత్త కంపెనీలు రంగ ప్రవేశం చేయడానికి దోహదపడడం కోసమే రాష్ట్రాలకు టీకా కొనుగోలు బాధ్యతను అప్పజెప్పినట్టు కేంద్రం చెప్పిన కారణాన్ని తిరస్కరించింది.
రాష్ట్రాల బాధ్యతగా వదిలిపెట్టిన 1844 ఏళ్ల వయసు జనాభాలో బహుజనులు, నిరుపేదలూ, సమాజం అంచుల్లోని ఇతర బలహీన వర్గాలు ఉంటారని వారికి టీకాను కొనుక్కునే స్తోమత కూడా ఉండదని మే 30 వ తేదీన ఇదే ధర్మాసనం కేంద్రం దృష్టికి తీసుకు వచ్చింది. రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న ప్రజల జీవన హక్కును కాపాడాలంటే వ్యాక్సిన్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వమే నేరుగా ధరను మాట్లాడి తానే టీకాను కొని రాష్ట్రాలకు ఇవ్వాలని ధర్మాసనం అప్పుడు స్పష్టంగా సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మే 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా తాను నిపుణులతో పలు సార్లు చర్చించి సలహాలు తీసుకున్న మీదటనే వ్యాక్సిన్ విధానాన్ని రూపొందించానని, ఈ రంగానికి సంబంధించిన నిపుణత కొరవడిన న్యాయ వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకోడం తగదని పేర్కొంటూ ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సోమవారం నాడు సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రకటించిన తీవ్ర ఆగ్రహాన్ని గమనిస్తే దాని వివరణతో అది బొత్తిగా సంతృప్తి చెందలేదని బోధపడుతున్నది. టీకాలకు ఉత్పన్నమైన కనీవినీ ఎరుగని అత్యవసర డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్బంధ లైసెన్సింగ్ నిబంధనలను అమల్లోకి తేవాలని సుప్రీం ధర్మాసనం చేసిన సూచనను కూడా కేంద్రం ఇంతకు ముందు తిరస్కరించింది.
ప్రధాని మోడీ ప్రభుత్వం ధోరణి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనేటట్టు ఉంది. ఎవరు ఎన్ని హితవులు పలికినా వాటిని తిరస్కరించి తాను అనుకున్న పంథాలో సాగిపోడమే తన ఉద్దేశమని అది చెప్పకనే చెబుతున్నది. కాని సుప్రీంకోర్టు పదేపదే తన టీకా విధానాన్ని బోనులో నిలబెట్టి ఆక్షేపించడాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా కేంద్రం తన వైఖరిని సవరించికోవలసి ఉంది. దేశ జనాభాలో కేవలం 3.12 శాతం మందికే ఇంత వరకు టీకా రెండు డోసులు పూర్తి అయ్యాయి. అమెరికాలో 40 శాతం మంది, బ్రెజిల్ లో10 శాతం మంది, రష్యాలో 8.2 శాతం మంది టీకాలు వేయించుకున్నట్టు సమాచారం. మొదట్లో ప్రపంచానికే టీకాలు దానం చేస్తామని ప్రకటించుకున్న మనం ఆరంభ శూరత్వంతోనే చతికిలపడిపోయాం. ప్రమత్తతతో నిద్ర తీసిన కుందేలును తలపించాము. కేంద్రం ఇకనైనా తప్పును దిద్దుకొని సుప్రీంకోర్టు హితవును పాటించడం దేశానికి శ్రేయస్కరం.