థర్డ్‌వేవ్ పట్ల వైద్యశాఖ అప్రమత్తం…
నిలోఫర్, గాంధీలో చిన్నారుల వైద్యం కోసం అదనపు పడకలు
వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
ఆగస్టులో వైరస్ విస్తరించే అవకాశముందంటున్న వైద్యులు
చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ రెండు దశల్లో విజృంభించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. అనేక మందికి మహమ్మారి సోకడంతో పాటు వందలాదిమంది పొట్టబెట్టుకుంది. త్వరలో మళ్లీ కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈదఫా వైరస్ పిల్లలపై ప్రభావం చూపుతుందని అందుకోసం ఆయా జిల్లా వైద్యాధికారులు వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించడంతో ఆదిశగా వైద్యాధికారులు ముందుకు వెళ్లుతున్నారు. నగరంలో చిన్నపిల్లల వైద్యానికి పేరుగాంచిన నిలోఫర్ ఆసుపత్రిల్లో సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత భవనంతో పాటు, ఇన్పోసిన్ భవనం, నాట్కో ఓపి భవనాలపై తాత్కాలిక షెడ్లు వేసి అదనపు పడకలు ఏర్పాటు చేస్తూ 1000 పడకలు సిద్దం చేసి చిన్నారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. గతేడాది మొదటి వేవ్‌లో ఆసుపత్రిలో 850 వైరస్ సోకితే చికిత్స అందించినట్లు, సెకండ్‌వేవ్‌లో 400మంది చిన్నారులకు సోకడంతో మెరుగైన వైద్యం అందించి చిన్నారులందరి కాపాడినట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో చిన్నారులకు వైరస్ సోకిందని, మనదగ్గర కూడా ఆగస్టు తరువాత వ్యాపించే అవకాశముందని అందుకోసం వైద్యశాఖ నిలోఫర్‌తో పాటు గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల కోసం పడకలు సిద్దం చేస్తున్నట్ల వైద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.
నిలోఫర్ ఆసుపత్రిని పీడియాట్రిక్ కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో థర్డ్‌వేవ్‌లో చిన్నారులకు వైరస్ సోకితే ఇక్కడికి తరలించి నాణ్యమైన వైద్యం చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిలోఫర్‌లో 12 పిడియాట్రిక్ యూనిట్లు, 4 జనరల్ సర్జరీ, 3 గైనకాలజీ, 2 నియోటాలజీ యూనిట్లు ఉన్నాయి. ఓల్డ్ బిల్డింగ్‌లో రాజీవ్‌శ్రీ కేర్ సెంటర్‌లో 10 కెఎల్ సామర్దం ఉన్న రెండు అక్సిజన్ ట్యాంకర్లు, ప్రస్తుతం పడకలే ఈసదుపాయాలు సరిపోతాయని, అదనపు పడకలు పెంచితే కష్టమని కొత్తగా అక్సిజన్ పైపులైన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనడంతో వాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్నారులను వైరస్ ఎటాక్ట్ చేస్తే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి థర్డ్‌వేవ్ ఎదుర్కొని హైదరాబాద్ అన్ని నగరాలకు ఆదర్శంగా నిలిచేలా చేస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జూలైలో పాఠశాలు ప్రారంభించే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు టీకా 18ఏళ్లపైబడినా వారికే వచ్చిందని, చిన్నారులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో లేవని, అందుకోసం వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తల్లిదండ్రులు చిన్నారుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, పోషకాహార పదార్దాలు ఇవ్వాలని, బయటకు వెళ్లకుండా చూడాలని, అత్యవసర పరిస్దితుల్లో వెళ్లితే మాస్కులు, బౌతికదూరం ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.
TS Health Ministry Alert for 3rd Wave of Covid 19