వలస పాలన అవశేషమైన రాజద్రోహ చట్టాన్ని ప్రభుత్వాలు ప్రజల స్వేచ్ఛా కంఠంపై ప్రయోగించడం సర్వసాధారణమైపోయింది. ప్రప్రథమ ప్రధాని, నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ హయాంలో వామపక్ష భావజాల పత్రిక ‘క్రాస్ రోడ్స్’పై, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ‘ఆర్గనైజర్’ మీద విరుచుకుపడినప్పటి నుంచి ఇప్పటికెన్నో సార్లు దీనిని మన ప్రభుత్వాలు మీడియాపై యమపాశం మాదిరిగా ఝళిపిస్తున్నాయి. నెహ్రూను విమర్శించినందుకు ‘క్రాస్‌రోడ్స్’ను నిషేధించడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పు పట్టి కొట్టి వేసింది. రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ద్వారా పౌరులకిచ్చిన హక్కులు, భద్రతకు ప్రమాదంగా పరిణమించినట్టు స్పష్టపడినప్పుడు మాత్రమే వాటిని సస్పెండ్ చేయగలమని కోర్టు అప్పుడు వెల్లడించింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ హక్కులలో ఒకటి. ఆ తర్వాత ‘ఆర్గనైజర్’పై సెన్సార్ ప్రయత్నాన్నీ న్యాయస్థానం అడ్డుకున్నది. పౌరులు ప్రభుత్వాలను ప్రశ్నించకుండా, వాటికి వ్యతిరేకంగా ఒక మాటైనా అనకుండా, ఎల్లప్పుడూ మెచ్చుకుంటూ భుజాన మోయవలసిన అగత్యమేమీ లేదని ఈ రెండు సందర్భాల్లోనూ న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది.
ఇప్పుడు కరోనా వార్తల ప్రసారానికి సంబంధించి రెండు తెలుగు చానెళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజద్రోహ కేసు పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అభ్యతరం తెలియజేసింది. ఈ కేసులో ఈ చానెళ్లకు రక్షణ కల్పించిన జస్టిస్ డి.వై చంద్రచూడ్ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నది. భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని రాజద్రోహ నిబంధన (124ఎ) కు పరిమితులు విధించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నది. ఎలెక్ట్రానిక్, ప్రచురణ మీడియా సంస్థల వార్తల, సమాచార వ్యాప్తి తదితర హక్కులపై, దేశంలోని ఏ భాగంలోనైనా గల ప్రభుత్వాలను విమర్శించడంలో మీడియాకున్న స్వేచ్ఛలపై రాజద్రోహ నిబంధనల ప్రయోగానికి హద్దు గీత గీయవలసి ఉందని ధర్మాసనం అభిప్రాయపడడం ఎంతైనా సంతోషదాయకం. గత నెల 1వ తేదీన కూడా న్యాయమూర్తులు యుయు లలిత్, ఇందిర బెనర్జీ, ఎంకె జోసెఫ్‌ల త్రిసభ్య ధర్మాసనం మణిపూర్, చత్తీస్‌గఢ్‌లకు చెందిన ఇద్దరు పాత్రికేయుల కేసును విచారణకు స్వీకరిస్తూ ఇదే విధంగా అభిప్రాయపడింది. రాజద్రోహ చట్టం రాజ్యాంగ పరంగా చెల్లుతుందో లేదో గీటు రాయి మీద పెట్టడానికి అంగీకరించింది.
ఈ జర్నలిస్టులిద్దరూ ఐపిసి 124(ఎ) ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను ప్రశ్నిస్తూ వ్యాఖ్యానించినందుకు, వ్యంగ్య చిత్రాలు గీసినందుకు తమపై రాజద్రోహం కేసు పెట్టారని ఈ చర్య రాజ్యాంగం 19 (1) (ఎ) ప్రసాదించిన ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నదని వారు అత్యున్నత న్యాయ స్థానానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పట్ల అయిష్టత, వ్యతిరేకత వ్యక్తం చేస్తే, ద్వేషాన్ని, ధిక్కారాన్ని రెచ్చగొడితే యావజ్జీవ ఖైదును కూడా విధించవచ్చని 124 (ఎ) సెక్షన్ చెబుతోంది. బ్రిటిష్ పాలకులు 1860లో ఈ సెక్షన్‌ను ఐపిసిలో చేర్చినప్పుడు విద్వేషం, ధిక్కారం అనే పదాలు లేవు. ఆ తర్వాత ‘ఎ’ ద్వారా వాటిని చేర్చారు. అప్పుడది 124 (ఎ) అయింది. స్వాతంత్య్రోద్యమంలో తిలక్, గాంధీలపై ఈ సెక్షన్‌ను ప్రయోగించారు. పౌరుల స్వేచ్ఛను అణచివేయడానికి తీసుకొచ్చిన రాజకీయ నేర నిబంధనలలో యువరాజు వంటిది ఈ సెక్షన్ అని గాంధీ జీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సభ చర్చల్లోనూ, స్వతంత్ర భారతంలో దీనిని కొనసాగించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
దానికి అనుబంధంగా ఉన్న ప్రాథమిక హక్కుల ఉప సంఘం దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు హద్దులు గీయడానికి ఈ సెక్షన్‌ను కొనసాగించాలని అభిప్రాయపడగా సర్దార్ వల్లబాయ్ పటేల్ కు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్రిటిష్ పాలకుల కంటే ఎక్కువగా మీరు మీ ప్రజలంటే భయపడుతున్నారా, వారి నుంచి రక్షణ కోరుకుంటున్నారా అనే ప్రశ్నలు ఆయనపై దూసుకొచ్చాయి. చివరికి ఆ అభిప్రాయాన్ని ఆ ఉపసంఘం ఉపసంహరించుకోవలసి వచ్చింది. 19(1)(ఎ) అధికరణ జీవం పోసుకున్నప్పుడు దానిని అరికట్టడానికి ఈ సెక్షన్ అవసరమన్న ప్రసక్తి రాలేదు. కానీ 1962లో కేదార్‌నాథ్ సింగ్, బీహార్ ప్రభుత్వం కేసులో ‘కాంగ్రెస్ గూండాలు’ అని దూషించినందుకు సుప్రీంకోర్టు రాజద్రోహ నేరారోపణ రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది. ఆ తర్వాత తీవ్రవాద సంస్థల్లో సభ్యులుగా ఉండడానికి, అటువంటి చర్యలకు పాల్పడడానికి మధ్య గల విభజన రేఖను, నక్సలైట్లకు అనుకూలంగా రాయడానికి, నక్సలైట్ కావడానికి మధ్య తేడాను గుర్తించారు.
అయినప్పటికీ ప్రభుత్వాలు పాత్రికేయులపైనా, కవులు, కార్టూనిస్టులు, కళాకారుల మీద ఇష్టావిలాసంగా రాజద్రోహ కేసులు పెట్టడం మానుకోడం లేదు. ప్రజాప్రతినిధి ప్రభుత్వాధికార దండాన్ని చేపట్టి పాలక పాత్ర వహించిన ప్పుడు రాజుగా మారిపోడమే రాజద్రోహ సెక్షన్‌కు చిరాయువుగా పని చేస్తున్నది. సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఈ రాబందు సెక్షన్ పెడరెక్కలు విరిచికట్టవలసి ఉంది.