Saturday, November 16, 2024

ఆ కాసులు కక్కిస్తాం

- Advertisement -
- Advertisement -

అధిక ఫీజులు వసూల్ చేసిన ఆసుపత్రుల నుంచి రీ ఫండ్ చేయిస్తాం
విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించండి
అవసరమైతే పూర్తి స్థాయి లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తాం
కేసులు తగ్గుతున్నాయని ప్రజలు నిర్లక్షంగా వ్యవహరించవద్దు
మాస్కు, భౌతికదూరం, శానిటేషన్‌లే శ్రీరామ రక్ష
మీడియా సమావేశంలో హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు, డిఎంఇ డా రమేష్‌రెడ్డిలు వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా చికిత్సకు ప్రభుత్వం సూచించిన ధరలు కంటే అదనంగా వసూల్ చేసిన ఆసుపత్రుల నుంచి బాధితులకు మనీ రీ ఫండ్ చేయిస్తామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి 114 హాస్పిటల్స్‌పై 185 ఫిర్యాదులు వచ్చాయని, వీటన్నింటకీ షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. అంతేగాక 22 ఆసుపత్రుల పర్మిషన్లను కూడా రద్దు చేశామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పేషెంట్లను బాధపెడితే అతి కఠిన చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం వెనకాడదని ఆయన చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ఆయన గురువారం కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా డిహెచ్ మాట్లాడుతూ… లాక్‌డౌన్‌తో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతం బెడ్ ఆక్యూపెన్సీ ఉండగా, ప్రైవేట్‌లో కేవలం 22 శాతం మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్వాలిటీ వైద్యం అందడంతోనే పేషెంట్లంతా గవర్నమెంట్ వైపు చూస్తున్నారన్నారు. మరి కొందరు ప్రైవేట్‌లో రేట్లు భరించలేక సర్కారీ దవాఖానాలకు వెళ్తున్నట్లు వివరించారు.
వెయ్యికి పైగా సెంటర్లలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నాం..
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను వెయ్యికి పైగా సెంటర్లలో నిర్వహిస్తున్నామని డిహెచ్ తెలిపారు. అంతేగాక జిహెచ్‌ఎంసి పరిధిలో స్పెషల్ డ్రైవ్ పేరిట ప్రతి రోజూ 30 వేల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. దీంతో పాటు మరో ఏడున్నర లక్షల డ్రైవర్లు, హైరిస్కు గ్రూప్‌లకు ఇవ్వబోతున్నామన్నారు. ఈ కేటగిరీలకు వరంగల్‌లో కూడా పంపిణీ చేస్తున్నామన్నారు.దీంతో పాటు విదేశాలకు వెళ్లే విద్యార్ధుల కోసం నారాయణగూడ ఐపిఎంలో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం నుంచి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈనెల 5వ తేది నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొవిషీల్డ్, కొవాగ్జిన్ కలిపి 9 లక్షల డోసులు నిల్వ ఉన్నాయన్నారు. వీటిని పకడ్బందీగా పంపిణీ చేస్తామన్నారు. అంతేగాక వ్యాక్సినేషన్ విస్తృతంగా జరగాలని ప్రైవేట్ ఆసుపత్రులకూ పర్మిషన్లు ఇచ్చామన్నారు. ఆయా ఆసుపత్రులు ఇప్పటికే గేటెడ్ కమ్యూనిటీ, కంపెనీలు, సొసైటీలను సమన్వయం చేసుకున్నాయని, డోసుల నిల్వను బట్టి పంపిణీ చేస్తారన్నారు. దీంతో పాటు మరో లక్ష 40 వేల మంది డెలివరీ బాయ్స్, తదితర కొరియర్లకు టీకా ఇచ్చేందుకు వైద్యశాఖ నేరుగా ప్రైవేట్ ఆసుపత్రులతో మాట్లాడుతుందన్నారు. కానీ ఆ సంస్థల యాజమాన్యాలు సదరు ఆసుపత్రులకు డోసు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక ఇప్పటి వరకు 45 ఏళ్లు దాటిన వారిలో 51 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. దీంతో పాటు 4.25 లక్షల హెల్త్‌కేర్ వర్కర్లు, 3. లక్షల 18 వేల ఫ్రంట్‌లైన్ వర్కర్లు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. డోసులు సప్లై లేకనే వ్యాక్సినేషన్ మందగిస్తుందన్నారు. జూలై, ఆగస్టు వరకు సుమారు 18 లక్షల డోసులు వస్తాయనే ఆశ ఉందని, అవి రాగానే ప్రయారిటీ ప్రకారం పంపిణీ చేస్తామని డిహెచ్ వివరించారు.
లాక్ డౌన్‌తో కేసులు తగ్గాయి: డిఎంఇ డా రమేష్‌రెడ్డి
లాక్‌డౌన్‌తో కేసులు తగ్గుముఖం పట్టాయని డిఎంఇ డా.రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ, నిర్లక్షం వహించవద్దని ఆయన సూచించారు. మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి కరోనా మార్గదర్శకాలు పాటించాల్సిందేనని చెప్పారు. మే మొదటి వారంలో 9.5 శాతం తేలిన పాజిటివిటీ రేట్ చివరి వారానికి 2 శాతానికి తగ్గిపోయిందన్నారు. దీంతోనే బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కానీ కేసులు తగ్గాయని ఇష్టం వచ్చినట్లు తిరిగితే మరో వేవ్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, దీని వలన వైరస్ సోకినప్పటికీ మైల్డ్ సింప్టమ్స్‌తో వెళిపోతుందన్నారు. ఇక ఇప్పటి వరకు 1100 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, నోడల్ సెంటర్లలో 250 ఆపరేషన్లు చేశామన్నారు. ప్రస్తుతానికి లైపోజోమల్ ఇంజక్షన్లు సప్లై కాస్త మెరుగుపడిందని, ఒక్కో పేషెంట్‌కు మొదట ఐదు ఇంజక్షన్ల చొప్పును ఇస్తున్నామన్నారు. అయితే ఇంజక్షన్లను సమకూర్చే బాధ్యత ఆయా ఆసుపత్రులకే ఉంటుందన్నారు. చికిత్స పొందుతున్న పేషెంట్ల వివరాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్‌కార్యాలయానికి వస్తే, తమ నోడల్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తారని, తర్వాత డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇంజక్షన్లు తీసుకోవచ్చన్నారు. మరోవైపు యంఫోటొరిసిన్ బి కేటాయింపులు కూడా కాస్త పెరిగాయని, ఏ మందు అందుబాటులో ఉంటే మొదట ఆ మందును తీసుకోవాలన్నారు. మరోవైపు కొందరి చిన్నపిల్లలకు పోస్టు కొవిడ్ సమస్యలు వస్తున్నట్లు గుర్తించామని, వారి కోసం ఎంఐసియూ వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

DH Srinivasa Rao Press Meet on Corona 2nd Wave

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News