పది ప్రాంతీయ భాషలలో కొవిన్ యాప్
న్యూఢిల్లీ: సామాన్య ప్రజలు మరింత సులభంగా కొవిడ్ టీకాల నమోదు చేసుకునేందుకు వీలేర్పడింది. తెలుగు, హిందీ, పంజాబీ వంటి మొత్తం పది ప్రాంతీయ భాషలలో కొవిన్ పోర్టల్‌లో వ్యాక్సిన్ కోసంఇక పౌరులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. సామాన్యులకు తెలియని భాషలలో కొవిన్ పోర్టల్ ఉండటంపై ఆందోళన వ్యక్తం అయింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ నాయకత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాంతీయ భాషలలో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే నిర్ణయం తీసుకున్నారు.
దీనిని క్రమపద్థతిలో అమలులోకి తీసుకువస్తున్నారు. వచ్చే వారం దేశంలోని 14 ప్రాంతీయ భాషలలో కొవిన్ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. కొవిన్‌లో ఇప్పటివరకూ తమ పేర్లు నమోదుచేసుకునేందుకు వచ్చినప్పుడు నిరక్షరాసులు అక్కడున్న వైద్యసిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పలు తప్పిదాలు జరగడం, పైగా టీకాల వేయడంలో జాప్యం ఏర్పడుతోంది. దీనిని నివారించేందుకు ఇప్పుడు ప్రాంతీయ భాషలలో కొవిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశాన్ని అధికార యంత్రాంగం తేలిగ్గా అందుబాటులోకి తీసుకురావల్సి ఉందని, సామాన్యుడికి అర్థం కాని నిబంధనలతో వారిని టీకాలకు దూరం చేయడం ఎంత వరకు సబబని ఇటవలే కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు పెట్టింది.