రైతుబంధు ప్రత్యేక డ్రైవ్‌లో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
భారీగా పెరగనున్న లబ్ధిదారుల సంఖ్య
మంత్రి కెటిఆర్ చొరవతో అన్నదాతలకు తొలగిన సమస్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: రైతుబంధు స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములకు సంబంధించి సుమారు 3 లక్షల దరఖాస్తులు రాగా వాటికి సంబంధించి 85 శాతం పరిష్కారం లభించినట్టు రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి రైతుబంధు పథకం అమలు కానున్న నేపథ్యంలో రైతులు భూముల సమస్యలు పరిష్కరించాలని ముందుగా మంత్రి కెటిఆర్‌కు కొందరు రైతులు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు సిఎస్ సోమేష్‌కుమార్ ఈ మెయిల్‌తో పాటు వాట్సప్ నెంబర్ ద్వారా భూ సమస్యలపై ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల దరఖాస్తులు రాగా గురువారం సాయంత్రం వరకు 85 శాతం భూముల సమస్యలకు పరిష్కారం లభించాయని వాటిని ధరణి వెబ్సైట్లో నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ధరణిలో నమోదయిన భూములన్నింటికీ దాదాపుగా రైతుబంధు అందుతుందని ఇప్పటికే వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు పేర్కొనడంతో భూ సమస్యలు పరిష్కారం అయిన రైతులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పిఓ బి, పెండింగ్, సక్సేషన్, ఎన్ఆర్ఐ, ఆధార్ అప్డేషన్కు సంబంధించిన సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. వీటితో పా టు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న వారు, అసైన్డ్ భూముల్లో కబ్జాలో ఉన్న వారు భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. గురువారం సాయంత్రానికి ఆర్డీఓ కార్యాలయాల నుంచి ఆయా జిల్లా కార్యాలయాలకు ప్రోసిడింగ్స్‌ను పంపించారు. రెండు, మూడురోజుల్లో పరిష్కారం అయిన భూముల వివరాలు ధరణిలో నమోదయ్యాయ లేదా అన్న వివరాలను మరోసారి సరిచూసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఉన్నతాధికారులకు ఆదేశాలు అందడంతో ఆ దిశగా రెవెన్యూ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
తహసీల్దార్లు భూ సమస్యలను పరిష్కరించారు
మా డివిజన్ పరిధిలో గ్రీవెన్స్‌సెల్ నుంచి 699 దరఖాస్తులు రాగా దాదాపుగా అన్నింటికి పరిష్కారం లభించింది. పెండింగ్ మ్యుటేషన్‌కు సంబంధించి 2207 దరఖాస్తులు రాగా 2100 దరఖాస్తులను పరిష్కరించాం. తహసీల్దార్లు వారి పరిధిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో ప్రస్తుతం ఈసారి రైతుబంధు లబ్ధిదారులు పెరగనున్నారు. చాలావరకు భూ సమస్యలకు పరిష్కారం లభించినట్టే. దీనివల పేద రైతులకు మేలు జరగనుంది.
-చౌటుప్పల్, ఆర్డీఓ, సూరజ్‌కుమార్
Rythu Bandhu distribution from June 15 in Telangana