డాక్టర్ ఫౌచీ విశ్లేషణ
వాషింగ్టన్ : కొవిడ్ వ్యాక్సిన్‌ల డోస్‌ల మధ్య వ్యవధి పెంచడం వల్ల ప్రజలు మరింతగా కొవిడ్‌కు గురవుతారని డాక్టర్ ఆంథోనీ ఫౌచీ స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఇప్పుడు ప్రమాదకర రీతిలో ఉన్న వేరియంట్లు ఎక్కువగా సోకుతాయని అమెరికా ప్రెసిడెంట్ వైద్య సలహాదారు అయిన ఫౌచీ హెచ్చరించారు. గత నెలలో భారత ప్రభుత్వం వెలువరించిన మార్గదర్శకాలలో వ్యాక్సిన్ల మధ్య విరామ కాలాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. దీని గురించి పరోక్షంగానే డాక్టర్ ఫౌచీ ప్రస్తావించారు. అమెరికాలో ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్లకు సంబంధించి సరైన ఇంటర్వెల్ మూడు వారాలు. ఫైజర్‌కు సంబంధించి ఇది 3 వారాలుగా, మాడెర్నపై 4 వారాలుగా ఖరారు చేశారని, అయితే ఈ విరామం పొడిగించడం వ్యక్తులు సరికొత్తగా వేరియంట్లకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్రిటన్‌లో వ్యవధినిపెంచారు.
అక్కడ ఇప్పుడు వేరియంట్లు సోకుతున్నాయని తెలిపారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ ప్రకారం యధావిధిగా డోస్‌లు మధ్య వ్యవధిని ఉంచాల్సి ఉందని తెలిపారు. ఉత్పత్తి, సరఫరాల కోణంలో వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని పెంచడం సరికాదని అయితే డిమాండ్‌కు తగ్గ టీకా లేకపోతే ఇది తప్పదేమో అని కూడా వివరించారు. ఇండియాలో కొవిషీల్డ్ రెండు డోస్‌ల మధ్య గడువును ఇంతకు ముందున్న ఆరు నుంచి ఎనిమిది వారాల నుంచి 12 16 వారాలకు భారత ప్రభుత్వం పెంచింది. ఈ నిర్ణయం వల్లనే ఇప్పటివరకూ భారత్‌లో స్తబ్థుగా ఉంటూ వచ్చిన డెల్టా వేరియంట్ తిరిగి పుంజుకుని ఉంటుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.