నేడు క్రెజికొవాతో పవ్లిచెంకొవా తుది సమరం
పారిస్: తొలి రోజు నుంచే సంచలన ఫలితాలతో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రష్యాకు చెందిన 31వ సీడ్ అనస్తాసియా పవ్లిచెంకొవా శనివారం జరిగే ఫైనల్లో చెక్ క్రీడాకారిణి బార్బొరా క్రెజికొవాతో తలపడుతుంది. డబుల్స్ విభాగంలో క్రెజికొవా ఇప్పటికే పలు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. కాగా పవ్లిచెంకొవా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా క్రెజికొవా కూడా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో తొలిసారి ఫైనల్లో ఆడనుంది. ఇద్దరికీ ఈ మ్యాచ్ చారిత్రాత్మకంగా మారింది. ఎవరూ గెలిచినా తమ కెరీర్‌లో కొత్త ఆధ్యాయాన్ని లిఖించుకుంటారు. ఆరంభం నుంచే ఇటు పవ్లిచెంకొవా అటు క్రెజికొవా అసాధారణ పోరాట పటిమతో అలరించారు. ఒక్కో మ్యాచ్‌లో గెలుస్తూ తుది పోరుకు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య జరిగే ఫైనల్ పోరుపై అందరి దృష్టి నిలిచింది. క్రెజికొవాతో పోల్చితే పవ్లిచెంకొవాకు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో మెరుగైన అనుభవం ఉంది.
అయితే డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఇప్పటికే గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడం క్రెజికొవాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ప్రస్తుతం మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో క్రెజికొవా, పవ్లిచెంకొవాలు అత్యంత సమీపంగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఇద్దరి మధ్య జరిగే ఫైనల్లో ఎవరూ గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. ఇక సెమీఫైనల్లో క్రెజికొవా అగ్రశ్రేణి క్రీడాకారిణి సక్కారిని ఓడించింది. హోరాహోరీగా సాగిన సెమీస్ సమరంలో అసాధారణ పోరాట పటిమను కనబరిచిన క్రెజికొవా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపు క్రెజికొవా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనే చెప్పాలి.
మరోవైపు పవ్లిచెంకొవా మాత్రం అలవోక విజయంతో ఫైనల్‌కు చేరింది. జిదాన్‌సెక్‌తో జరిగిన పోరులో పవ్లిచెంకొవా పెద్దగా శ్రమించక కుండానే విజయాన్ని అందుకుంది. కానీ ఫైనల్ పోరులో మాత్రం పవ్లిచెంకొవాకు ప్రత్యర్థి క్రెజికొవాతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఇందులో ఎవరూ గెలిచినా వారికి అది తొలి సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అవుతుంది. మరోవైపు అసాధారణ ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన వీరిద్దరూ తుది పోరులో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో సమరానికి సిద్ధమయ్యారు.కాగా ఇద్దరి మధ్య జరిగే ఫైనల్ సమరం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.