న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి సంబంధించి ఉత్తర్వులను ఈ నెల 15న వెల్లడిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ఒప్పందం, భారత్, ఇటలీ, కేరళ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం విధి విధానాలను న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, ఎంఆర్ షాలతో కూడిన వెకేషన్ మెంచ్ ప్రస్తావిస్తూ మెరైన్లు మస్సిమిలానో లాటొర్రే, సాల్వటోర్ గిరోనెలపై నేరాలను ఇకపై ఇటలీ అక్కడే విచారిస్తుందని తెలిపారు. కాగా నష్టపరిహారం పంపిణీ పథకం ప్రకారం మృతుల కుటుంబాల వారసులకు ఒక్కొక్కరికి తలా నాలుగు కోట్ల రూపాయలను, ఫిషింగ్ బోటు యజమానికి రూ.2 కోట్లు ఇవ్వడం జరుగుతుందని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది ఈ కేసులో విచారణను మూసి వేయాల్సిందిగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులను మంగళవారానికి వాయిదా వేసిన బెంచ్ నష్టపరిహారం సొమ్మును పంపిణీ కోసం కేరళ హైకోర్టుకు బదిలీ చేయాలని, ఆ సొమ్ము పక్కదారి పట్టకుండా చూడాలని అభిప్రాయపడింది. 2021 ఫిబ్రవరిలో భారత సముద్ర జలాల్లో మర పడవలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు కేరళ మత్సకారులను ఇటలీకి చెందిన ఎంవి ఎన్రికా లెక్సీ ఓడలోని మెరైన్లు కాల్చి చంపినట్లు భారత ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా, ఇంతకు ముందు చెల్లించిన ఎక్స్‌గ్రేషియా కాకుండా అదనంగా రూ.10 కోట్ల సొమ్మును ఇటలీ ప్రభుత్వం కేంద్రం వద్ద డిపాజిట్ చేసిందని, ఆ మొత్తాన్ని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేసిందని విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఒక దేశంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. కాగా అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మెరైన్లపై ఉన్న కేసు విచారణను మూసి వేయాలని ఇటలీ తరఫు సీనియర్ న్యాయవాది సోహైల్ దత్తా బెంచ్‌ని కోరారు.
SC orders to close Italian Marines case