హోరాహోరీ పోరులో జకోవిచ్ గెలుపు, నేడు ఫైనల్లో సిట్సిపాస్‌తో ఢీ
పారిస్: మట్టి కోర్టు రారాజుగా పేరు తెచ్చుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జైత్ర యాత్రకు ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ (సెర్బియా) బ్రేక్ వేశాడు. డిఫెండింగ్ నాదల్‌తో జరిగిన సెమీ ఫైనల్లో జకోవిచ్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన మారథాన్ పోరులో జకోవిచ్ 36, 63, 76(7/4),62తో నాదల్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకున్నాడు.
ఆరంభం నుంచే..
అనుకున్నట్టే చిరకాల ప్రత్యర్థులు నాదల్‌జకోవిచ్‌ల మధ్య ఆరంభం నుంచే హోరాహోరీ నెలకొంది. ఇద్దరు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగారు. అయితే ఆరంభ సెట్‌లో నాదల్ ఆధిపత్యం చెలాయించింది. జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడును ప్రదర్శించాడు. తన మార్క్ షాట్లతో అలరించిన నాదల్ కీలకమైన 40 ఆధిక్యాన్ని అందుకున్నాడు. ఈ దశలో జకోవిచ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. నాదల్ జోరుకు అడ్డుకట్టు వేస్తూ వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకున్నాడు. కానీ నాదల్ మాత్రం తన హవాను కొనసాగిస్తూ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి జకోవిచ్ ఆధిపత్యం చెలాయించాడు. నాదల్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా అడుగులు వేశాడు. ఇదే క్రమంలో నాదల్ వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమై జకోవిచ్‌కు కోలుకునే అవకాశం ఇచ్చాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సెర్బియా యోధుడు సెట్‌ను దక్కించుకున్నాడు.
హోరాహోరీ..
ఇక మూడో సెట్‌లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఆరంభంలో జకోవిచ్ ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి పైచేయి సాధించాడు. కానీ నాదల్ కూడా పట్టు వదలకుండా పోరాడుతూ జకోవిచ్ ఆధిపత్యానికి బ్రేక్ వేశాడు. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇటు జకోవిచ్, అటు నాదల్ పట్టువీడకుండా పోరాటం చేస్తూ కనువిందు చేశారు. వీరిద్దరూ సర్వం ఒడ్డడంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. అయితే ఇందులో కూడా పోరు ఆసక్తికరంగానే సాగింది. కానీ చివరికి విజయం మాత్రం జకోవిచ్‌కే వరించింది. మరోవైపు నాలుగో సెట్‌లో మాత్రం నాదల్ పూర్తిగా అలసిపోయాడు. జకోవిచ్‌కు కనీస పోటీ కూడా ఇవ్వకుండానే మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ రారాజుగా పేరు తెచ్చుకున్న నాదల్ ఈసారి మాత్రం సెమీఫైనల్‌లోనే ఇంటిదారి పట్టాడు. తొలి సెట్‌లో ఓడినా అసాధారణ పోరాట పటిమతో తర్వాతి మూడు సెట్లలో గెలిచిన జకోవిచ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే ఫైనల్లో గ్రీక్ వీరుడు, ఐదు సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్‌తో జకోవిచ్ తలపడుతాడు. ఫైనల్లో గెలిస్తే జకోవిచ్ ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ చేరుతుంది. ఇక ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచి 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో చరిత్ర సృష్టించాలని భావించిన నాదల్‌కు నిరాశే మిగిలింది. ప్రస్తుతం నాదల్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చెరో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమంగా ఉన్నారు.
ఫైనల్ సమరం నేడే
మరోవైపు ఆదివారం జరిగే ఫైనల్ పోరులో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. సిట్సిపాస్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ప్రవేశించాడు. ఇక జకోవిచ్ ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఓ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధించిన జకోవిచ్ ఈసారి కూడా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. కొన్నేళ్లుగా వరుసగా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుస్తూ జకోవిచ్ ప్రపంచ టెన్నిస్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఈసారి కూడా టైటిలే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాడు. ఇక సిట్సిపాస్ కూడా తొలి ప్రయత్నంలోనే టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉన్నాడు.