Tuesday, November 5, 2024

ఢిల్లీ ఘర్షణల కేసులో విద్యార్థులకు బెయిల్

- Advertisement -
- Advertisement -

Bail for students in Delhi riots case

నిరసనకు ఉగ్రవాద రూపం వద్దన్న హైకోర్టు

న్యూఢిల్లీ : గత ఏడాది జరిగిన ఈశాన్య ఢిల్లీ ఘర్షణల కేసులో ముగ్గురు విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పింజ్రా తోడ్ సంస్థ తరఫున ఉద్యమించిన వీరికి వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనాయంత్రాంగం తీరు తెన్నులపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘సమాజంలో పలు రకాల అసమ్మతిని అణచివేసే తాపత్రయంలో ప్రభుత్వాలు కొన్ని రేఖలను తుడిపేస్తున్నాయి. నిరసనలకు దిగే పౌరుల హక్కులకు ఉగ్రవాద కార్యకలాపాలకు మధ్య ఉండే రేఖను తుడిచేసి ఈ రెండు ఒక్కటే అనే భావనను కల్పించే యత్నం చేస్తున్నాయి.

ఇటువంటి అధికారిక దూకుడు, సంఘర్షణాత్మక వైఖరి మరింత బలోపేతం అయితే అది ప్రజాసామ్యానికి విషాద దినం అవుతుందని ధర్మాసనం తెలిపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఘర్షణల కేసులో జెన్‌ఎయు, జమియా మిల్లియా ఇస్లామియా విద్యార్థులు ముగ్గురికి బెయిల్ మంజురు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్, అనుప్ జైరామ్ భంభాణితో కూడిన ధర్మాసనం ఉగ్రవాద చర్యలను అధికార యంత్రాంగం ఏ పరిధిలో పరిగణనలోకి తీసుకుంటున్నదో అనేది అర్థం కావడం లేదన్నారు.

ఇది అయోమయంగా ఉందని వ్యాఖ్యానించారు. అత్యంత కటుతరమైన యుఎపిఎ చట్టాల పరిధిలో ఉగ్రవాద చర్యల పేరిట విచారణకు దిగడం, ఇటువంటి అన్ని కూడా అసంబద్ధ ధోరణితో ఉండటం పరిస్థితిని దిగజారుస్తోందని పేర్కొన్న హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ నిరాకరణ ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు రూలింగ్ ఇచ్చింది. నిరసనలు వ్యక్తం చేసుకునే హక్కును వేరే అతి చర్యగా వేరే విధంగా చిత్రీకరించుకోవడం సరికాదని తెలిపారు. ఈ ఘర్షణల కేసులో పింజ్రా తోడ్ ఉద్యమకర్తలు నర్వాల్, కలిత, తన్హాలను గత ఏడాది మేలో అరెస్టు చేశారు. వీరిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. వీరికి బెయిల్ రావడం పట్ల విద్యార్థి సంఘాలు , హక్కుల సంస్థలు మంగళవారం హర్షం వ్యక్తం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News