మార్కెట్ వాల్యూ సవరించడం ద్వారా
సంవత్సరానికి సుమారుగా రూ.12,500 కోట్ల ఆదాయం
ఆగష్టు 01వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం !
ఐటి కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న చోట భారీగా పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్: ఇప్పటికే భూములను అమ్మాలని నిర్ణయించిన ప్రభుత్వం భూముల విలువను కూడా పెంచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనున్నట్టుగా సమాచారం. పెంచిన భూ విలువలను ఆగష్టు 01వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది. భూమి విలువలను సవరించడం ద్వారా సంవత్సరానికి సుమారుగా రూ.12,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఐటి కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న చోట భారీగా మార్కెట్ వాల్యూను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. మార్కెట్ విలువ పెంపులో భాగంగా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ విలువ ఆధారంగా 100 శాతం నుంచి 200 శాతం పెంచనున్నట్టుగా సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను 30 శాతం వరకు, మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో 50 శాతం భూమి విలువలను పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
చివరగా 2013 ఆగష్టులో భూముల విలువలను పెంచగా అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని నిర్ణయించినా వివిధ కారణాలతో వాయిదా పడుతోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో మరోసారి భూముల విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే వివిధశాఖల దగ్గర ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణా విధానాన్ని అనుసరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.