కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి
వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్‌గా కొత్త మంత్రులు
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. బృందాలవారిగా ఈ సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. కేంద్ర మంత్రి మండలిలో వచ్చే కొద్ది రోజులలో కీలక మార్పులు చేర్పులు జరుగుతాయనే వార్తల నడుమ ఎంపిలతో బిజెపి అత్యంత ప్రధాన వ్యహకర్త అయిన షా భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గ మార్పులపై ప్రధాని మోడీ నివాసంలో షా, బిజెపి అధ్యక్షులు నడ్డాల త్రయం రెండు మూడు దఫాలు భేటీ అయింది. పలు కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కొవిడ్ మహమ్మారి దశలో కొందరు మంత్రుల నిర్లిప్త వైఖరి, అంతకు ముందు కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలను రైతులకు సరిగ్గా నచ్చచెప్పడంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ విఫలం అయ్యారనే విమర్శలు తలెత్తడం, కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో ప్రభుత్వంపై ప్రజలలో సరైన ఆలోచనను పెంపొందింపచేయడంలో మంత్రుల విఫలం వంటి అంశాలు ప్రధానంగా ప్రధానిని, అమిత్‌షాను వేధిస్తున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే కీలకం
ఇప్పుడు ఉన్నత స్థాయి తరువాతి దశలో మధ్యస్థ దశలో నెలకొంటోన్న అధికారిక వ్యతిరేకత క్షేత్రస్థాయికి చేరుకుంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి ఏమిటనే భయాందోళనలు పార్టీ అధినాయకత్వంలో నెలకొన్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా బిజెపి వ్యతిరేక ప్రతిపక్ష కూటమి ఇప్పటికైతే రూపుదిద్దుకోకపోవడం, ఇక ముందు సమీప భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుందనే అభిప్రాయం లేకపోవడం, ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌కు నాయకత్వ లోపం వంటి అంశాలతో బిజెపి సవాళ్లను ఎదుర్కోకపోవచ్చు. అయితే ఈ పరిస్థితిని నమ్ముకుని ముందుకు సాగితే నడి రేవులో ఎక్కడైనా పడవ మునక ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ఈ దశలో వివిధ రాష్ట్రాల ఎంపిలతో అమిత్ షా వేర్వేరుగా చర్చిస్తున్నారు. ఓ వైపు కేబినెట్ విస్తరణ అంశం గురించి వారి ముందు ప్రస్తావించడం, యుపి, కర్నాటక పరిణామాల గురించి ఆరాతీయడం, అన్నింటికి మించి రాష్ట్రాలవారిగా బిజెపి పట్ల ప్రజలలో ఉన్న ప్రస్తుత స్పందన ఏమిటనేది ఆయన అడిగితెలుసుకుంటున్నారు. గత ఐదు రోజులుగా ప్రధాని మోడీ , షా వేర్వేరుగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతూ వస్తున్నారు.
ప్రజా సమస్యలపై తక్షణ దృష్టి
ఇటీవలే అమిత్ షా యుపి, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపిలతో పలు విషయాలు చర్చించారు. దాదాపుగా 30 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు షాను కలుసుకున్నారు. దేశంలో సెకండ్ వేవ్ కరోనా తగ్గుముఖం దాఖలాలు కన్పిస్తున్నాయి. ఇక తిరిగి అత్యంత కీలక ప్రజాసమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది. ఎంపిలు అంతా తమ నియోజకవర్గాలలోని సమస్యల పరిష్కారానికి ముందుకు రావాల్సి ఉంటుంది. వారి నుంచి ప్రభుత్వానికి అందే ఎటువంటి ప్రతిపాదనలు అయినా సరైన రీతిలో పరిశీలించి తగు నిధుల ద్వారా పనులు పూర్తి అయ్యేలా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపిలకు షా భరోసా ఇస్తూవస్తున్నారు. కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా బిజెపిని తగు విధంగా బలోపేతం చేసుకునేందుకు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాల గురించి కూడా ఆయా రాష్ట్రాల ఎంపిలతో షా అడిగి తెలుసుకున్నారు.
28 మందితో విస్తరణ?
వర్షాకాల పార్లమెంట్ సమావేశానికి ముందు కేంద్ర మంత్రి మండలిలో పునర్వస్థీకరణ ఉంటుందని వార్తలు వెలువడ్డాయి. 28 మందితో కేంద్ర మంత్రి మండలివిస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షులు, కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి వంటి పరిణామాలతో మంత్రివర్గంలో కీలక బెర్తులకు ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రధాని కసరత్తు చేస్తున్నారు. ఈ దిశలో వ్యూహబాధ్యతను షా తీసుకున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి మండలిలో 21 మంది కేబినెట్ మంత్రులు, తొమ్మండుగురు సహాయ మంత్రులు స్వతంత్ర హోదాలతో ఉన్నారు. ఇక 23 మంది సహాయ మంత్రులు ప్రధాని మోడీతో పాటు కొలువై ఉన్నారు. ఎన్‌డిఎలోని భాగస్వామ్యపక్షాలను ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం, సాధ్యమైనంత వరకూ కొత్త మిత్రపార్టీలను కూటమిలోకి తీసుకోవడం వంటి పరిణామాలపై బిజెపి అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు ఎంపీల స్థాయిలో మంత్రుల స్థాయిలో జరిగే సమీక్షా సమావేశాలలో వెలువడే అంశాలను పరిగణనలోకి తీసుకుని బిజెపిని ప్రభుత్వ పరిపాలనా అధికార యంత్రాంగాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవల్సి ఉందని భావిస్తున్నారు.