Saturday, November 23, 2024

ఈ వైఫల్య మూలం ఎక్కడుంది?

- Advertisement -
- Advertisement -

PM Modi failure in india

భారతీయ ఉన్నత వర్గాల ఈ సంపదలో ఎక్కువ భాగం ఆశ్రిత (క్రోనీ) క్యాపిటలిజం, వారసత్వం ద్వారా పోగుపడినదే. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ వారి కోసం మాత్రమే విధానాలను రూపొందిస్తుంది. మెజారిటీ భారతీయుల సంక్షేమం గురించి పెద్దగా ఆందోళన లేదు. ఉదాహరణకు, ఆరోగ్యంపై 2017- 18 లో భారత ప్రభుత్వం ఖర్చు చేసింది జిడిపిలో కేవలం 1.28 మాత్రమే. ఆరోగ్యంపై అత్యల్పంగా బడ్జెట్ కేటాయిస్తున్న దేశాలలో మన దేశం ఒకటి. ఏడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి కూడా ఇదే స్థాయిలో నిర్వహించబడుతున్న సిగ్గుమాలిన రికార్డు ఇది. ఫలితంగా ప్రజారోగ్య సౌకర్యాల నాణ్యత తక్కువగా ఉన్నది.

ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుండి భారత దేశంలో కొవిడ్-19 కేసుల్లోవచ్చిన వినాశకరమైన పెరుగుదలకు, దాన్ని నిలువరించడంలో భారత ప్రభుత్వం అధ్వాన్నంగా విఫలం కావడానికి గల కారణాల గురించి చాలా మంది చాలా రాశారు. అనేక ఇతర విషయాలతో పాటు పాలకుల అసమర్థత, వ్యతిరేక అభిప్రాయాల పట్ల అసహనం, అహంకారం, జాతీయ ప్రాధాన్యతల కంటే తన సొంత ప్రచారంపట్ల ప్రధాని నరేంద్ర మోడీకున్న ఆసక్తి వంటి అనేక విషయాలను వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలను పక్కదారి పట్టించడానికి, దాని మద్దతు దారులు కూడా స్వయంగా ‘వ్యవస్థ’ ను కారణంగా చెబుతున్నారు. దేశంలో చచ్చుబడిన హెల్త్ కేర్ వ్యవస్థను గత ప్రభుత్వాల నిర్వాకంగా చూపిస్తూ తమ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అవును, ఈ అంశాలన్నీ కొవిడ్- 19 వ్యాప్తిలో పాత్ర పోషించాయి, ఇది జరగవలసిన దాని కంటే చాలా ఎక్కువ వినాశనాన్ని కలిగించటంలో తోడ్పడ్డాయి. అయినప్పటికీ, ప్రపంచంలోని 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఒక దేశం, రెండవ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న దేశం, అతి పెద్ద ఫార్మా శక్తి, ఉక్కిరిబిక్కిరి అవుతున్న పౌరులకు ఆక్సిజన్ లేదా చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల వంటి ప్రాథమికమైన వాటిని ఎందుకు అందించలేక పోయింది? క్లుప్తంగా సమాధానం ఆధునిక భారతీయ రిపబ్లిక్ అనే భవనం బ్రిటిష్ వలస రాజ్యం పునాది పైననే నిర్మించబడింది. – ఈ రాజ్యాంగం కేవలం అత్యంత ధనికులైన ఒక చిన్న మైనారిటీ సెక్షను భారతీయుల తరఫున మాత్రమే పని చేయడానికి రూపొందించబడింది. ఆ కొద్ది మంది గుత్తాధిపతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వా లు నిర్వహించబడుతున్నాయి. అధిక సంఖ్యాకులు తమను తామే రక్షించుకోవాలి. వాళ్ళని వదిలి వేశారు. ఇక్కడ పాలకులు -పాలితుల మధ్య విభజన, ఇరువురి ప్రయోజనాల మధ్య వైరుధ్యం చాలా తీవ్రంగా ఉన్నది. అనేక ప్రత్యేక అంశాల వల్ల ఈ రెండు సెక్షన్ల మధ్య దూరం చాలా ఎక్కువగా వున్నది.
అనేక విభజనలతోనూ, అనేక వివక్షలతోను కూడుకొని ఉన్న వ్యవస్థ ఇది. మతాలు, కులాలు ప్రజలని విడదీస్తున్న అంశాలలో ప్రధానమైనవి. దీని ఫలితంగా భారతీయ సమాజంలో కొందరు, జనాభాలోని చాలా విస్తారమైన వర్గాన్ని సాటి మానవులుగానే పరిగణించరు. అంటరానివారుగా తీసి వేస్తారు. దానితో వివిధ సమూహాల మధ్య సహజంగా వుండవలసిన సహానుభూతి, సహకారం లోపిస్తుంది. అలాంటి వాళ్ళు చనిపోతున్నా మిగిలిన వారికి అదో పెద్ద విషయంగా అనిపించదు. మొదటి నుండి సామాజిక వివక్షలకు గురియవుతున్నవారు, ఈ సంక్షోభంలోనూ అదే వివక్షకు లోనవుతున్నారు. కరోనా చికిత్స కేంద్రాలు, టీకా సదుపాయం, పెద్ద కార్పొరేటు వైద్యశాలలు, ప్రభుత్వ సంస్థలు, సరఫరాలు పెద్ద పట్టణాలు , నగరాల మీద కేంద్రీకరించటంతో గ్రామీణ జనాభా ఒక వివక్షకు గురి అవుతున్నది. కరోనా ప్రభావం తగ్గించ గల ప్రధాన సాధనం రోగ నిరోధక శక్తి. కొందరిలో ఈ రోగనిరోధక శక్తి చాలా తక్కువగా వుంటుంది, బలమైన పోషకాహారం రోగ నిరోధకత్వాన్ని పెం పొందింప చేస్తుంది. అయితే భారత దేశంలో విస్తృతమైన పోషకాహార లోపం వుంది. ఇది కొన్ని ప్రత్యేక సామాజిక వర్గాలలో అత్యం త అధికంగా కనిపిస్తుంది. ఈ లోపాన్ని వివక్షతో సాగించే మానవ మారణహోమం కంటే తక్కువ గా భావించలేము. మరో మాటలో చెప్పాలంటే దేశంలో అధికారంలో ఉన్నవారు, పెద్ద వర్గాలు, సామాన్య భారతీయ పౌరులలో మరణాలను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు. భారతదేశంలోని వయోజన జనాభాలో 33 శాతానికి పైగా బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువగా ఉంది. ఇది తీవ్రమైన పోషకాహార లోపాన్ని సూచిస్తుంది. ఇంకా, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ పిల్లల్లో 47% మంది వయస్సుకు తగ్గ బరువు లేరు. నవజాత శిశువుల్లో కూడా 26% తక్కువ బరువుతో పుడుతున్నారు. ప్రమాణాల ప్రకారం వీరంతా పోషకాహార లోపంతో బాధపడుతున్నారనే చెప్పాలి.
అటువంటి పోషకాహార లోపం భారతీయ జనాభాలో అంతటా సమానంగా కనపడటం లేదు. ఎక్కువగా షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈ రెండు వర్గాల భారతీయ పౌరులు జనాభాలో 29 శాతానికి పైగా ఉన్నారు. అయితే పోషకాహార లోపం కేసుల్లో వీరి శాతం సగానికి పైగా ఉన్నది. క్షయ, మలేరియా లేదా డయేరియా, న్యూమోనియా కారణంగా శిశు మరణాలలో కావచ్చు. దేశం వ్యాధి భారంలో కావొచ్చు, ఎక్కువ భాగం వారి నుంచే వుంటోంది. మరో విధంగా చెప్పుకుంటే ఈ అనారోగ్య స్థితికి ప్రధాన కారణం పేదరికం. పేదలలో అత్యధిక భాగం ఈ రెండు సామాజిక వర్గాల నుండి వున్నారని అర్థమవుతుంది.
ఇతర వెనుకబడిన కులాలలోని, పేద వర్గాలలో పోషకాహార లోపం, వ్యాధుల భారం మోస్తున్నవారు మరో 40% శాతం మంది ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో 107 దేశాలలో భారతదేశం 94వ స్థానంలో ఉంది. రువాండా, నైజీరియా, అఫ్ఘానిస్తాన్, లైబీరియా, మొజాంబిక్, చాద్ వంటి మరో 13 దేశాలు మాత్రమే మనకంటే అధ్వాన్నంగా ఉన్నాయి. చాలా మంది పేదలలో వున్న అధ్వాన్నమైన ఆరోగ్యానికి, వారు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందలేకపోవడానికి కొన్ని ప్రామాణిక వివరణలు వున్నాయి: రాజకీయ ఉదాసీనత, జాతీయ వనరులను ప్రణాళికా బద్ధంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సమీకరించి ఉపయోగించకపోవటం, ఉద్యోగ వర్గం ముఖ్యంగా పై స్థాయి బ్యూరోక్రాట్ల బాధ్యతారాహిత్యం అని చెప్పుకోవచ్చు .పేదల ప్రాణాలకు విలువ లేదు. కొవిడ్ 19 విపత్కర ప్రభావానికి రెండవ వ్యవస్థాగత కారణం- భారతదేశం దేశంలోని ఆర్ధిక అసమానత, అసమాన అభివృద్ధి, సంపద అసాధారణ కేంద్రీకరణ. భారతీయ సమాజం లోని 10% పై స్థాయి వారి చేతిలో దేశ సంపద లో 77 % పోగుపడి వున్నది. ప్రపంచంలోనే సంపూర్ణ పేదరికంలో ఉన్న ప్రజలు అత్యధిక సంఖ్యలో వున్నది మన దేశంలోనే.
భారతీయ ఉన్నత వర్గాల ఈ సంపదలో ఎక్కువ భాగం ఆశ్రిత (క్రోనీ) క్యాపిటలిజం, వారసత్వం ద్వారా పోగుపడినదే. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ వారి కోసం మాత్రమే విధానాలను రూపొందిస్తుంది. మెజారిటీ భారతీయుల సంక్షేమం గురించి పెద్దగా ఆందోళన లేదు. ఉదాహరణకు, ఆరోగ్యంపై 2017- 18లో భారత ప్రభుత్వం ఖర్చు చేసింది జిడిపిలో కేవలం 1.28 మాత్రమే. ఆరోగ్యంపై అత్యల్పంగా బడ్జెట్ కేటాయిస్తున్న దేశాలలో మన దేశం ఒకటి. ఏడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుండి కూడా ఇదే స్థాయిలో నిర్వహించబడుతున్న సిగ్గుమాలిన రికార్డు ఇది. ఫలితంగా ప్రజారోగ్య సౌకర్యాల నాణ్యత తక్కువగా ఉన్నది. మొత్తం ఆరోగ్య సంరక్షణలో ఈనాడు 75 శాతానికి పైగా ప్రైవేట్ రంగంలో ఉంది. చాలా మంది భారతీయులకు మంచి ఆరోగ్య సంరక్షణ అనేది భరించ శక్యం కానిది. అంతేకాదు ఆరోగ్యంపై ఖర్చు చేయడం వల్ల చాలా మంది తలకు మించిన అప్పుల్లో పడిపోతున్నారు. ఆరోగ్య రక్షణ కోసం చేసిన అప్పులే ప్రజల అప్పులకు పెద్ద కారణం. భారతదేశంలో జరిగే ఆత్మహత్యల్లో 20% పైగా ఆరోగ్య పరమైన ఆందోళనల వల్లనే జరుగుతున్నాయి. మన ఆరోగ్య రంగం ఎంత అధమ స్థాయిలో వుందో తెలిసిపోతుంది.
మరో మాటలో చెప్పాలంటే ‘వ్యవస్థ’ వైఫ ల్యం భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అధికారం చెలాయించినవారి ‘అసమర్థత’ లేదా ఏదో ఒక ‘సోమరితనం’ కాదు. భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కొద్ది మందికి ఉపయోగపడుతూ, పౌరులలో ఎక్కువ మంది బాధలు పడటానికే నిర్వహించ బడుతోంది. ప్రజల అనవసరపు, తప్పించగలిగిన చావులకు కారణమవుతోంది. లాభాల వేట లో ఇటువంటి తీవ్రమైన క్రూరత్వం చూపటం ద్వారా మాత్రమే ఈ దోపిడీ వ్యవస్థ తనను తాను నిలబెట్టుకో గలుగుతుంది. అప్పుడే కొనసాగ గలుగుతుంది. సామాజిక వర్గాల మధ్య అంతరాలను, అసమానతలను కూలదోసే, సంపదను తిరిగి పంపిణీ చేసే తీవ్రమైన విధానాలు లేకుండా, మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఆచరణ సాధ్యం కాదు. కొవిడ్- 19 సంక్షోభం నుండి నేర్చుకుంటున్న నిజమైన పాఠం ఏమిటంటే ఈ రోజు ప్రజల స్వంత మనుగడ ఈ వివక్షల, అసమానతల వలసవాద వ్యవస్థను రద్దు చేసి ప్రజాతంత్ర వ్యవస్థను నిర్మించుకోవటంలోనే ఉంది.

ఎస్ జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News