ట్విటర్‌కు గట్టి షాక్…చట్టపరమైన రక్షణ ఎత్తివేత
యుపిలో ట్విటర్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ : ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించనందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌కు భారత్‌లో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని సమాచారం. ట్విటర్ తన మధ్యవర్తి హోదాను కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వవర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇకపై అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విటర్ కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. భారత్‌లో ఈ విధంగా హోదా కోల్పోతున్న తొలి సోషల్ మీడియా ట్విటర్ కావడం విశేషం. కొత్త నిబంధనల ప్రకారం కొంతమంది కీలక అధికారులను ట్విటర్ నియమించాల్సి ఉన్నా అలా చేయనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
యుపిలో ట్విటర్‌పై కేసు
మతపరమైన హింసను ప్రోత్సహించే ట్వీట్లను తొలగించలేదని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై వెంటనే మొదటి కేసు ఇప్పుడే నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 5న ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో ఓ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆ సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ట్విటర్‌తోపాటు మతపరమైన హింసను ప్రోత్సహించారని ఆరోపిస్తూ పలువురు జర్నలిస్టుల పైనా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. మే 26 నుంచి కొత్త ఐటి నిబంధనలు అమలు లోకి వచ్చాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ట్విటర్‌కు హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజా నిబంధనల ప్రకారం వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఫిర్యాదుల అధికారిని. నోడల్ అధికారిని, అనుసంధాన కర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్ లోనే నివసించాల్సి ఉంటుంది. ట్విటర్ ఒక్కటే ఈ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించడం లేదని, మిగతా సోషల్ మీడియా సంస్థలు పాటిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్త చేస్తోంది. దీనిపై జూన్ మొదటి వారం లోనే తుది నోటీసులు ట్విటర్‌కు ప్రభుత్వం జారీ చేసింది. కానీ దీనికి ట్విటర్ సరిగ్గా స్పందించలేదు. ఎవరిని నియమించారో ఆ అధికారుల వివరాలను ట్విటర్ వెల్లడించలేదు. దాంతో తన మధ్యవర్తి హోదాను ట్విటర్ కోల్పోయినట్టు ప్రభుత్వ వర్గాలు బుధవారం పేరొఈ్కన్నాయి. అయితే కొత్త నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో అధికారులను నియమించినట్టు ట్విటర్ మంగళవారం వెల్లడించింది. ట్విట్ల పరంగా వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి సంధాన కర్తగా ఓ అధికారిని నియమించామని ట్విటర్ తెలియచేసింది. ఈ వివరాలన్నీ ఐటి మంత్రిత్వశాఖకు త్వరలో తెలియచేస్తామని పేర్కొంది.
ట్విటర్‌కు చాలా అవకాశాలు ఇచ్చాం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
కొత్త నిబంధనలను పాటించడానికి ట్విటర్‌కు చాలా అవకాశాలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవడంలో ట్విటర్ విఫలమైందని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం వెల్లడించారు. కూ అనే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్‌లో ట్విటర్‌కు చట్టబద్ధమైన రక్షణ తొలగించడాన్ని ఆయన సమర్ధించారు. సామాజిక మాధ్యమం విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ వంటి దేశాల్లో నిప్పు రవ్వ అయినా అగ్నిజ్వాలకు కారణమవుతుందన్నారు. కొత్త నిబంధనలు నోటిఫై చేయడానికి ఇదో కారణంగా ఆయన పేర్కొన్నారు. వాక్‌స్వాతంత్య్రానికి తానే నాయకత్వం వహిస్తున్నట్టు చెప్పుకునే ట్విటర్ మధ్యవర్తిత్వ మార్గదర్శకాల దగ్గరకు వచ్చేసరికి ఉద్దేశపూర్వక ధిక్కార మార్గాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
కొత్త నిబంధనలు
సామాజిక మాధ్యమాలు, వార్తాసైట్లు, ఓటిటి వేదికలకు సంబంధించి ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరున భారత్‌లో అమలయ్యే కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో నోటిఫై చేసింది. మే నెలాఖరు నుంచి ఇవి అమలు లోకి వచ్చాయి. దేశంలో ఆయా సంస్థలు తమ పేరు, చిరునామా, అధికారుల వివరాలు తమ యాప్‌ల్లో, సైట్లలో స్పష్టంగా వివరించాలి. నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి దేశీయంగానే అంతర్గత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువు లోగా ఫిర్యాదులను పరిష్కరించాలి. అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు, తదితర వివరాలు నెలకోసారి అందచేయాలి. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలక అంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారం పోస్టింగులు పెడితే వాటి మూలాలను (మెసేజ్ లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియచేయాల్సి ఉంటుంది. ఎవరైనా వినియోగదారుల సందేశాలను కానీ, వారి అకౌంట్లను కానీ సామాజిక మాధ్యమం నుంచి తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోడానికి తగిన సమయం కల్పించాలి. సామాజిక మాధ్యమాలపై వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వం లోని ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండక పోతే ఆయా మాధ్యమాలకు రక్షణగా ఉన్న మధ్యవర్తి హోదా రద్దు అవుతుందని కేంద్రం పిబ్రవరి లోనే హెచ్చరించింది. ఈ హోదా వల్ల సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకర సమాచారం పెట్టినా, దాన్ని తమ వేదికగా ప్రచారం చేసినా ఆ సంస్థకు ఏమీ కాదు. పోస్టు పెట్టిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునే వారు. ఇప్పుడు ఈ హోదా రద్దయితే ఆయా సంస్థలు క్రిమినల్ చర్యలు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది.
Twitter loses legal protection in India