ముంబయి: విశేష జనాదరణ పొందిన టివి సీరియల్ రామాయణ్‌లో ఆర్య సుమంత్ పాత్రలో నటించి మంచి పేరు పొందిన సీనియర్ నటుడు చంద్ర శేఖర్ బుధవారం తన 98 ఏట కన్నుమూశారు. చ చ చ, సురంగ్ తదితర హిందీ చిత్రాలలో నటించిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యుల సమక్షంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారని, ఆయనకు వృద్ధాప్య సమస్యలు తప్ప ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని ఆయన కుమారుడు, ప్రముఖ నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. ఆయన మృతదేహానికి సాయంత్రం జుహులోని పవన్ హంస్ స్మశానవాటికలో దహన సంస్కారాలు జరిగాయి.
హైదరాబాద్‌లో జన్మించిన చంద్రశేఖర్ 1950వ దశకంలో జూనియర్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి ప్రవేశించారు. 1954లో వి శాంతారాం నిర్మించిన సారంగ్‌లో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. కవి, మస్తానా, బసంత్ బహార్, కాలీ టోపీ లాల్ రుమాల్, బర్సాత్ కీ రాత్ వంటి చిత్రాలలో ఆయన నటించారు. 1964లో ప్రముఖ నటి హెలెన్ హీరోయిన్‌గా చ చ చ చిత్రాన్ని స్వీయ దర్శకతంగా సొంతంగా ఆయన నిర్మించారు. 1987లో రామానంద్ సాగర్ దర్శకత్వంలో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ్ సీరియల్‌లో దశరథ మహారాజు కొలువులో ప్రధానమంత్రి ఆర్య సుమంత్ పాత్రలో చంద్రశేఖర్ నటించారు. 1990 దశకం వరకు సాగిన తన చిత్ర యాత్రలో ఆయన 250కి పైగా సినిమాలలో నటించారు. 1972-76 మధ్య కాలంలో ప్రముఖ రచయిత-దర్శకుడు గుల్జార్‌కు పరిచయ్, కోషిష్, అచానక్, ఆంధీ, కుష్బు, మౌసమ్ వంటి చిత్రాలకు సహాయకునిగా కూడా చంద్రశేఖర్ పనిచేశారు. చంద్రశేఖర్‌కు ముగ్గురు పిల్లలు.