Saturday, November 23, 2024

హక్కులకు కవచం

- Advertisement -
- Advertisement -

Delhi High Court deeply dissatisfied with ‘Uapa’ abuse

 

రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ రాజధాని పోలీసులకు చీవాట్లు పెట్టడం ద్వారా దేశంలో ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ప్రజాస్వామ్య విలువలకు ఢిల్లీ హైకోర్టు ఆక్సిజన్ అందించింది. పౌరసత్వ సవరణ చట్టా (సిఎఎ)నికి వ్యతిరేకంగా జరిగిన ఈశాన్య ఢిల్లీ నిరసనలు అల్లర్ల సందర్భంగా జెఎన్‌యు, జామియా మిలియా వర్శిటీల విద్యార్థులు ముగ్గురిని గత ఏడాది మేలో ‘ఉపా’ కింద అరెస్టు చేసిన కేసులో న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. జెఎన్‌యు విద్యార్థినులు దేవాంగన కలిత, నటషా నర్వాల్‌లకు, జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తనహాకు న్యాయమూర్తులు సిదార్ధ మృదుల్, అనుప్ జయరామ్ భంభానీల ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈ ముగ్గురు విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు పెట్టిన అల్లర్ల సంబంధమైన ఇతర కేసుల్లో స్థానిక కోర్టులు ఇంతకు ముందే బెయిల్ మంజూరు చేశాయి.

కాని తీవ్రమైన ఉగ్రవాద ఆరోపణల ‘ఉపా’ చట్టం కింద నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ లభించలేదు. పర్యవసానంగా తమ ముందుకు వచ్చిన ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం ఢిల్లీ పోలీసులు ఎవరి మీద పడితే వారి మీద ఆషామాషీగా ‘ఉపా’ను ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. పౌరులకున్న నిరసన ప్రకటన హక్కుకు, టెర్రరిస్టు చర్యలకు మధ్య చాలా తేడా ఉందని పోలీసులు ఆ విభజన రేఖను చెరిపివేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. నిరసన అవకాశాన్ని శాంతియుత పరిధులకు లోబడి గరిష్ఠంగా వినియోగించుకునే హక్కు పౌరులకున్నదని అభిప్రాయపడింది. ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనే అతి భయంతో రాజ్యాంగ హక్కుకు, టెర్రరిస్టు చర్యకు మధ్య గల గీతను అదృశ్యం చేస్తున్నదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మన జాతి పునాదులు గట్టివని విశ్వవిద్యాలయ విద్యార్థులు గాని, ఇతరులు గాని ఎంతటి దురుద్దేశంతో చేసే ఎటువంటి నిరసన ప్రదర్శనలకైనా అవి ఊగిపోవని న్యాయమూర్తులు వెలిబుచ్చిన అభిప్రాయం అమిత విలువైనది.

ప్రజాస్వామ్య మనుగడకు ప్రాణప్రదమైనది. గత ఏడాది సిఎఎ తదితర రాజ్యాంగ విరుద్ధ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అనేక మందిని ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేసినప్పుడు ఢిల్లీ మైనారిటీల కమిషన్ మాజీ సభ్యుడు ఎసి మైఖేల్, రచయిత, సామాజిక కార్యకర్త హర్ష్ మందిర్, నాట్య కళాకారిణి మల్లికా సారాబాయి, నర్మదా బచావ్ ఆందోళన సారథి మేథా పట్కర్ మున్నగు పలువురు ప్రముఖులు ఈ చట్టం దుర్వినియోగాన్ని ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం కొవిడ్ లాక్‌డౌన్ కల్పించిన అవకాశాన్ని దేశమంతటా అసమ్మతిని అణచివేసేందుకు వాడుకుంటోందని వారందులో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే వారి ప్రాథమిక హక్కులను ‘ఉపా’ ద్వారా కబళిస్తున్నదని అన్నారు. బూటకపు కేసులతో కార్యకర్తలను జైల్లో తోస్తున్నదని కూడా ఎత్తి చూపారు. 2019 డిసెంబర్‌లో అసోంకి చెందిన సమాచార హక్కు కార్యకర్త అఖిల్ గొగోయ్‌ను ‘ఉపా’ కింద అరెస్టు చేశారు.

2020 ఏప్రిల్‌లో డాక్టర్ ఆనంద్ తేల్ తుమ్డే, గౌతమ్ నవ్‌లఖాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఈ చట్టాన్ని ప్రయోగించింది. జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో దీనిని ప్రయోగించి ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ‘ఉపా’ కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. 2019లో రాజ్యసభలో ఈ చట్టం సవరణ బిల్లును ఆమోదించినప్పుడు అమిత్ షా మాట్లాడుతూ కేవలం టెర్రరిజాన్ని ఎదుర్కోడానికే దీనిని ఉపయోగిస్తామని చెప్పారని అందుకు బదులుగా అసమ్మతిని, హక్కుల ఆందోళకారులను అణగదొక్కి వారి నోరు మూయించడానికి ప్రయోగిస్తున్నా రని ఈ లేఖ రాసిన ప్రముఖులు పేర్కొన్నారు. భీమా కొరేగావ్ కేసులో 11 మంది ప్రజాస్వామ్య హితులైన ప్రముఖులను అక్రమంగా అరెస్టు చేసి అసలు నిందితులైన, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సంభాజీ బిడే, మిలింద్ ఎగ్బోటేలను వదిలిపెట్టారని ప్రజాస్వామ్య సంస్కరణల ప్రజా సంఘం (పియుడిఆర్) మున్నగు అనేక సంస్థలు ఎత్తి చూపుతున్నాయి.

దేశంలోని నిరాధార వర్గాలైన ఆదివాసీలు, దళితులు వంటి దీన సమూహాల తరపున పని చేస్తున్నందుకే వయసులో పెద్దవారైన మేధావులను కూడా మాసాల తరబడి జైలులో ఉంచి వేధిస్తున్నారని ఈ సంస్థలు విమర్శిస్తున్నాయి. అందుచేత ఢిల్లీ హైకోర్టు ‘ఉపా’ దుర్వినియోగంపై వెలిబుచ్చిన తీవ్ర అసంతృప్తి ఇటువంటి అక్రమ అరెస్టులకు స్వస్తి పలికిస్తుందని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News