Friday, November 22, 2024

ఇరాన్ నూతన అధ్యక్షుడిగా రైసి

- Advertisement -
- Advertisement -

Ebrahim Raisi as the new President of Iran

ఖమేనీ అనుకూల మాజీ న్యాయమూర్తి

టెహ్రాన్ : ఇరాన్ కొత్త అధ్యక్షులుగా ఇబ్రహీం రైసి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 18న జరిగిన దేశాధ్యక్ష ఎన్నికలలో ఈ మాజీ అత్యున్నత న్యాయమూర్తి ఆధిక్యత కొనసాగుతోంది. మరో ముగ్గురు నేతల కన్నా ఆయన ముందంజలో ఉన్నారు. మరో వైపు అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన ఏకైక మితవాది అబ్దుల్‌నసీర్ హెమ్మాతి, రెవల్యూషనరీ గార్డు మాజీ అధిపతి మెహసెన్ రెజాయి కౌంటింగ్ దశలోనే రైసిని అభినందించారు. దీనితో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీకి అత్యంత అనుకూలమైన ఇబ్రహీం రైసి ఇరాన్ దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. ఇరాన్‌లో దేశాధ్యక్షుడిని అధికారిక ర్యాంకింగ్‌లో రెండో వ్యక్తిగా పరిగణిస్తారు. ఇరాన్ సుప్రీంనేతనే ఆ దేశానికి ప్రథమ వ్యక్తి.

అయితే దేశీయ, విదేశీయ విధానాలలో అధ్యక్షుడిదే కీలక నిర్ణయం అవుతుంది. కానీ ఏదైనా తుది ఆమోద ముద్ర ప్రక్రియ సుప్రీం నేతదే అవుతుంది. ఇప్పుడు 1.78 కోట్ల ఆధిక్యతతో ఉన్న రైసి ఇంతకు ముందు ఎక్కువ కాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2019లో దేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రౌహానీ చేతిలో ఓడారు. ఈసారి ఎన్నికలలో పోటీకి దిగిన అభ్యర్థులు వివిధ రంగాలలో కీలక పాత్రలు పోషించినవారే కావడం విశేషం. రైసి న్యాయవ్యవస్థలో ప్రధానబాధ్యతలు నిర్వర్తించారు. ఇక అబ్దుల్ నసీర్ ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చీఫ్‌గా ఉన్నారు. అత్యంత కీలకమైన ఇరాన్ సైన్యం చీఫ్‌గా పనిచేసిన రెజాయి కూడా రంగంలో నిలిచారు. ఇప్పుడు దేశాధ్యక్ష బాధ్యతలు తీసుకునే రైసికి అతివాద భావజాలపు ముద్ర ఉంది. ఇప్పటికి కౌంటింగ్ పూర్తి కానందున అధ్యక్షుడి ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News