ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును భారత్ తప్పుదారి పట్టిస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం శనివారం ఆరోపించింది. ఇదే విషయంలో అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని బాధ్యతలు నెరవేర్చడానికి పాక్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ కోర్టు తీర్పు ప్రకారం కులభూషణ్ కేసును తిరిగి సమీక్షించడానికి వీలుగా పాక్ ప్రతిపాదించిన చట్టం లేదని, అందులోని లోపాలను సవరించాలని భారత్ గురువారం పాక్‌కు సూచించింది. దీనిపై పాక్ విదేశీ కార్యాలయం శనివారం స్పందించింది. దౌత్య సంబంధమైన అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చడానికి పాక్ కట్టుబడి ఉందని పేర్కొంది. కులభూషణ్ తరఫున న్యాయవాదిని నియమించాలని ఎంతగా కోరుతున్నా భారత్ పట్టించుకోకుండా ఉద్దేశ పూర్వకంగా అస్పష్టం చేస్తోందని విమర్శించింది. ఈ విషయంలో పాక్ చొరవ తీసుకుని కులభూషణ్ తరఫు న్యాయవాదిని నియమించాలని ఇస్లామాబాద్ హైకోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించింది.