మధుకాన్ గ్రూపు ఆఫ్ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాప్తవం లేదు
ఈడీ దర్యాప్తునకు సహకరిస్తాం
ఎవరెన్నీ ప్రలోభాలలు పెట్టినా తలొగ్గను
సిఎం కెసిఆర్ వెన్నంటే ఉంటా
మనతెలంగాణ/హైదరాబాద్: నీతి, నిజాయితీలకు కట్టుబడే వ్యక్తిత్వం తనదని, తన బలం సిఎం కెసిఆర్ అని, తన బలగం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు అని ఖమ్మం ఎంపి, లోక్‌సభ టిఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల మధుకాన్ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ సందర్భంగా శనివారం నామా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తాను స్థాపించిన మధుకాన్ గ్రూపు ఆఫ్ కంపెనీ బ్యాంకులకు సొమ్ము ఎగవేసిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈడీ సోదాలు, ఆర్థిక అవకతవకల వ్యవహారంలో కంపెనీ చిక్కుకున్న పరిస్థితులను ఆయన వివరించారు. తమ కంపెనీపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. బీహార్‌లో చెట్లు కొట్టి వేస్తున్నారని 2014లో పిల్ వేశారని, దీంతోపాటు జార్ఖండ్‌లో వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం వల్ల తమకు ఎన్‌హెచ్‌ఏ ప్రాజెక్టు నుంచి కొన్ని కంపెనీలను విరమించాయని ఆయన పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తుకు సహకరిస్తామని, ఎవరెన్నీ ప్రలోభాలలు పెట్టినా తాను తలొగ్గనని, తాను సిఎం కెసిఆర్ వెన్నంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నీతి, నిజాయతీలకు కట్టుబడే వ్యాపారం, రాజకీయాలు చేశానని నామా తెలిపారు.
మధుకాన్ గ్రూపు ఆస్తుల మళ్లీంపు అంశం ఆధారంగా ఈడీ దర్యాప్తు
జార్ఖండ్ రాష్ట్రంలో జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టులో మధుకాన్ గ్రూపు ఆస్తుల మళ్లీంపు అంశం ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుగుతోందని నామా వెల్లడించారు. జాతీయ రహదారుల అథారిటీతో కలిసి తాము చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ఎన్‌హెచ్‌ఏ సకాలంలో ఇవ్వాల్సిన సైట్ ఇవ్వనందు వల్లే ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయానన్నారు. తద్వారా తాము ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.485 కోట్లు, ఎస్క్రూ అకౌంట్ ద్వారా బ్యాంకు మంజూరు చేసిన రూ.685 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు చేశామన్నారు. వడ్డీల ద్వారా మరో రూ.378 కోట్లు కలిపి తామే రూ.1,030 కోట్లు బాకీ పడ్డామని నామా తెలిపారు. 60 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును ఎన్‌హెచ్‌ఏ మధ్యలోనే రద్దు చేసిందన్నారు. ఈ క్రమంలో తామే చాలా నష్టపోయామని ఈ వ్యవహారాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసినట్లు నామా తెలిపారు. ఎస్క్రూ అకౌంట్ ద్వారా తీసుకున్న సొమ్ముపై కంపెనీకి చెక్ పవర్ ఉండదని, ప్రాజెక్టు పనుల నిమిత్తం బ్యాంకే ఫండ్‌గా విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. కాబట్టి తాము బ్యాంకులకు ఎగవేశామనే ఆరోపణలు తగవన్నారు.
40 ఏళ్ల క్రితం మధుకాన్ సంస్థను స్థాపించా
చైనా సరిహద్దులు, కొంకన్ రైల్వే వంటి జాతీయ ప్రాజెక్టుల్లో పనులు పూర్తి చేసిన ఘనత మధుకాన్ గ్రూపు కంపెనీకి ఉందని, తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ వ్యవహారంలోకి తమ కంపెనీని లాగారాని ఆయన ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని, 40 ఏళ్ల క్రితం మధుకాన్ సంస్థను తాను స్థాపించానన్నారు. 2004 సంవత్సరంలోనే కంపెనీకు చెందిన డైరెక్టర్ సహా అన్ని హోదాల నుంచి తాను వైదొలిగినట్లు ఆయన తెలిపారు. అనంతరం తన సోదరులకు కంపెనీ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈడీ దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఆర్బిటరీ ట్రిబ్యునల్‌లో కంపెనీకి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎవరెన్నీ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా తాను వెరువనని, ఏదేమైనా తాను సిఎం కెసిఆర్ వెన్నంటే ఉంటానన్నారు. తన గురించి ప్రజలకు తెలుసనీ, తాను నీతి నిజాయితీతో ఉంటానన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజ్యాంగ వ్యవస్థ అనే బాటలో ముందుకు వెళ్తున్నానన్నారు.