బ్రిస్టోల్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్ బరిలోకి దిగిన భారత మహిళా క్రికెట్ అసాధారణ ఆటతో అభిమానులను ఆకట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో మిథాలీరాజ్ సేన అద్భుత పోరాట పటిమతో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన తీరును ఎంత పొగిడినా తక్కువే. భారత్ క్లిష్ట పరిస్థితుల్లోనూ మొక్కువోని ధైర్యంతో ఆడి ఇంగ్లండ్‌ను విజయం నుంచి దూరం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మెరుగైన స్కోరును సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా ఒత్తిడిని తట్టుకోలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు అసాధారణ బ్యాటింగ్‌తో భారత్‌కు శుభారంభం అందించారు. షఫాలీ ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించింది. ఇక స్టార్ బ్యాటర్ మంధాన కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగి పోయింది. ఇద్దరు కలిసి ఇంగ్లండ్‌పై తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరు మెరుగైన ఆరంభం ఇవ్వడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపించింది.
కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్విమెన్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్క దీప్తి శర్మ 29 (నాటౌట్) మినహా మిగతావారు పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 167 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచిన భారత్ 231కే ఆలౌటై ఫాలోఆన్‌కు గురైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ భారత్‌కు అండగా నిలిచింది. మరో ఓపెనర్ మంధాన తక్కువ స్కోరుకే ఔటైనా దీప్తి శర్మతో షఫాలీ జట్టును ఆదుకుంది. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న షఫాలీ 63 పరుగులు చేసింది. దీప్తి శర్మ 54 పరుగులతో తనవంతు సహకారం అందించింది. పూనమ్ రౌట్ కూడా బాగానే ఆడింది. అయితే కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్‌ప్రీత్ (8), పుజా వస్త్రాకర్ (12) తదితరులు విఫలం కావడంతో భారత్ 199 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది.
వారి పోరాటం చిరస్మరణీయం..
ఈ దశలో మ్యాచ్‌ను కాపాడుకునే బాధ్యతను స్నేహ్ రాణా, వికెట్ కీపర్ తానియా భాటియా తమపై వేసుకున్నారు. వీరిద్దరూ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా కెరీర్లో ఆడిన తొలి టెస్టులోనే వీరిద్దరూ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన స్నేహ్ రాణా 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమెకు భాటియా 44 (నాటౌట్) అండగా నిలిచింది. వీరిద్దరూ దాదాపు 30 ఓవర్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని అజేయంగా క్రీజులో నిలువడంతో ఓడాల్సిన మ్యాచ్‌లో భారత్ డ్రాతో గట్టెక్కింది. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టుపై భాటియా, స్నేహ్ పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువేనని చెప్పక తప్పదు.
IND w vs ENG w test match draw