వ్యాక్సిన్ ఇస్తామని డబ్బులు వసూలు
రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేసిన మేనేజర్
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి నిర్మాత సురేష్‌బాబుకు సైబర్ నేరస్థులు కుచ్చుటోపీ పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. సినీ నిర్మాత సురేష్‌బాబుకు సైబర్ నేరస్థుడు నాగార్జున రెడ్డి కొద్ది రోజుల క్రితం ఫోన్ చేశాడు. తన వద్ద 500 కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పాడు. దానికి ముందుగా డబ్బులు పంపించాలని చెప్పాడు. ఇది నమ్మిన సురేష్ బాబు నిందితుడి భార్య బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలు పంపించాల్సింగా మేనేజర్‌కు చెప్పారు. మేనేజర్ నిందితుడి భార్య బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాడు. తర్వాత వ్యాక్సిన్లు ఇవ్వకపోడంతో మోసపోయానని గ్రహించిన సురేష్‌బాబు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
నాగార్జున రెడ్డి కాదు… నాగేంద్రబాబు
వ్యాక్సిన్ల పేరుతో పలువురిని మోసం చేస్తున్న నిందితుడి అసలు పేరు నాగార్జున రెడ్డి కాదని నాగేంద్రబాబుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఆరు కేసులు ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మూడు కేసులు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రెండు కేసులు, విజయవాడలో ఒక కేసు ఉంది. గతంలో నిందితుడు ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేశాడు. కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ ఛానల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. నగర సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా నాగేంద్రబాబును సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.