కివీస్‌కు రవిశాస్త్రి అభినందనలు
సౌతాంప్టన్: తమతో పోల్చితే న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసిందని, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతగా నిలిచేందుకే కివీసే అర్హురాలని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. డబ్ల్యుటిసి ట్రోఫీని సాధించిన కివీస్ జట్టును రవిశాస్త్రి అభినందించాడు. ఫైనల్ సమరంలో చివరి వరకు అత్యుత్తమ ప్రదర్శన చేసిన కివీస్‌కే విజయం వరించిందన్నాడు. ఆ జట్టే ఐసిసి ట్రోఫీకి నిజమైన అర్హురాలనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. తమ ఓటమికి న్యూజిలాండ్ ఆటతీరే ప్రధాన కారణమన్నాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ కివీస్ ఆటగాళ్లు కొనసాగించిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు.
ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచిన జట్టుకే విజయం వరించిందన్నాడు. ఐసిసి ట్రోఫీ కోసం న్యూజిలాండ్ దశాబ్దాలుగా చెమటోడ్చుతుందని, ఎట్టకేలకు వారి శ్రమకు తగిన ఫలితం దక్కడం తనను ఆనందానికి గురి చేసిందన్నాడు. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావని, దీనికి చాలా శ్రమించాల్సి వస్తుందన్నాడు. కివీస్ కూడా అసాధారణ పోరాట పటిమతో తన చిరకాల వాంఛను తీర్చుకుందన్నాడు. ఐసిసి టెస్టు చాంపియన్‌గా అవతరించిన కివీస్‌ను రవిశాస్త్రి అభినందించాడు. గురువారం ఓ ట్వీట్ చేస్తూ ఈ విషయాలు వెల్లడించాడు.