ప్రజాస్వామ్య పటిష్టానికి ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 46 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి రోజులను ఆయన శుక్రవారం గుర్తుచేశారు. భారతదేశ ప్రజాస్వామిక స్ఫూర్తిని బలోపేతం చేసి రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పాటిద్దామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా మన ప్రజాస్వామిక సిద్ధాంతాలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని, ఎమర్జెన్సీని ప్రతిఘటించి దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన మహా నాయకులను మనం స్మరించుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరచిపోలేమని, 1975 నుంచి 1977 వరకు ఒక పద్ధతిగా దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ఇతర బిజెపి సీనియర్ నాయకులు పలువురు కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. అధికార దాహం, అహంకారంతో 1975లో ఇదే రోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా ఎలుగెత్తిన గళాలన్నిటినీ ఎమర్జెన్సీ ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసిందని ఆయన అన్నారు. భారత ప్రజాస్వామిక చరిత్రలో అదో చీకటి అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాళులర్పించారు.