కస్టమర్‌పై సెక్యూరిటీ గార్డ్ కాల్పులు
యుపిలోని ఓ బ్యాంక్‌లో ఘటన
లక్నో: ఫేస్‌మాస్క్ విషయంలో మొదలైన గొడవ కాల్పులకు దారితీసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బరేలీ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ ఘటన జరిగింది. బ్యాంక్‌లోకి మాస్క్ లేకుండా ప్రవేశించేందుకు యత్నించిన రాజేశ్‌కుమార్ అనే వ్యక్తిపై అక్కడి సెక్యూరిటీ గార్డ్ కాల్పులు జరిపాడు. మాస్క్ లేకుండా వెళ్లేందుకు రాజేశ్ ప్రయత్నించగా, సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. దాంతో, వెనక్కి మళ్లి మాస్క్‌తో తిరిగి లోపలికి వెళ్లేందుకు యత్నించగా లంచ్ టైం అంటూ గార్డ్ మరోసారి అడ్డుకున్నాడు. దాంతో, ఇద్దరి మధ్యా మాటలతో ప్రారంభమైన గొడవ, తోపులాటకు, ఆ తర్వాత కాల్పులకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రక్తపు మడుగులో పడి ఉన్న రాజేశ్ పక్కన ఆయన భార్య అరుస్తున్న దృశ్యాలను అక్కడి కస్టమర్ ఒకరు రికార్డు చేశారు. 27 సెకండ్లపాటు ఉన్న ఆ వీడియోలో తన భర్తపై కాల్పులు ఎందుకు జరిపావు అంటూ గార్డ్‌ను ఆ మహిళ ప్రశ్నించారు. మరో వ్యక్తి కూడా నీవు జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ సెక్యూరిటీ గార్డ్‌ను హెచ్చరించారు. అందుకు బదులిస్తూ తాను జైలుకు వెళ్లేందుకూ సిద్ధమేనని గార్డ్ ధీమాగా మాట్లాడటమూ రికార్డయింది. కాల్పుల్లో గాయపడ్డ రాజేశ్‌కు ప్రాణాపాయమేమీ లేదని, ఆయనకు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ గార్డ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని బరేలీ పోలీస్ చీఫ్ రోహిత్‌సింగ్ సజ్వాన్ తెలిపారు.