భావి తరాలను కూడా అనుసంధానించే విధంగా అభివృద్ధి
అయోధ్య అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ప్రధాని
న్యూఢిల్లీ: అయోధ్య నగరం ప్రతి భారతీయుడికి సుపరిచితమైన నగరమని, సాంస్కృతిక నగరంలో ప్రభారతీయుడి మదిలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అభివృద్ధి పనుల్లో సంప్రదాయాలు, సాంస్కృతికత స్పష్టంగా గోచరిస్తూ ఉండాలని, అందులో సంస్కృతి మిళితమై పోవాలని సూచించారు. అయోధ్య నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు రాబోయే తరాలను కూడా అనుసంధానించే విధంగా ఉండాలని అన్నారు. అయోధ్య నగరం అభివృద్ధిపై ప్రధాని మోడీ శనివారం వర్చువల్ పద్ధతిలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. శ్రీరాముడు తన పరిపాలనలో ఎలాగైతే ప్రజలను ఏకతాటిపై నడిపించారో అదే విధంగా అయోధ్య అభివృద్ధి విషయంలోసమాజం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రధాని సూచించారు. ‘అయోధ్య అందరి నగరం. ఆధ్యాత్మిక నగరం. ఉత్కృష్ట నగరం.
చేపట్టబోయే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు భావి తరాలకు సరిపడేలా ఉండాలి. యాత్రికులతో పాటుగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా ఉండాలి. భవిష్యత్తులోనే అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉండాలి. అత్యంత కీలకమైన అభివృద్ధి దశ ఇప్పుడే ప్రారంభమైంది. అయోధ్య గుర్తింపును, సాంస్కృతిక చైతన్యాన్ని సజీవంగా ఉంచడానికి సమష్టిగా కృషి చేద్దాం. పాత కొత్తల మేలు కలయికగా నగరం ఉండాలి’ అని మోడీ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఒక్కసారైనా అభివృద్ధిని సందర్శించాలనే తపన భావి తరాలలో కలిగేలా అభివృద్ధి ఉండాలని ప్రధాని సూచించారు. నగరాభివృద్ధిలో నిపుణులైన యువత నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని కూడా ఆయన అన్నారు.