బ్రిస్టోల్: టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డుకు చేరువైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం ఆడిన క్రికెటర్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును మిథాలీ సమీపిస్తోంది. మిథాలీ ఇప్పటికే 22 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడుతోంది. ఈ క్రమంలో సచిన్ తర్వాత అత్యధిక కాలం అంతర్జాతీయ క్రికెట్‌ను ఆడిన రెండో క్రికెటర్‌గా నిలిచింది. ఇక వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళా వన్డే ప్రపంచకప్ వరకు క్రికెట్‌లో కొనసాగాలని మిథాలీ నిర్ణయించింది. దీంతో సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును మిథాలీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సచిన్ 22 ఏళ్ల 91 రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు. మిథాలీ ఇప్పటికే 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకుంది. మరో మూడు నెలల పాటు క్రికెట్‌లో కొనసాగితే మిథాలీ తన పేరిట అరుదైన రికార్డును నమోదు చేసుకోవడం ఖాయం. ఏదైన అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప సచిన్ రికార్డు తెరమరుగు కావడం ఖాయమనే చెప్పాలి.