జమ్మూ కశ్మీర్‌లోని జమ్ము వైమానికి దళ కేంద్రంపై ఆదివారం అర్ధరాత్రి గడిచిన తర్వాత జరిగిన డ్రోన్ల దాడి మన వాయు సేనకు ఎటువంటి నష్టమూ కలిగించలేదు. అయినప్పటికీ శత్రువు నుంచి ముందు ముందు ఎదురు కానున్న సవాలు తీవ్రతను ఇందులో చూడవచ్చు. ఈ ఘటనలో వైమానిక దళ కేంద్రంలోని ఒక భవనం పై కప్పు స్వల్పంగా దెబ్బ తిన్నదని, ఇద్దరికి చిన్న చిన్న గాయాలయ్యాయని వార్తలు చెబుతున్నాయి. రాత్రి 1.30 గం. ప్రాంతంలో 5 నిమిషాల తేడాలో జరిగిన ఈ రెండు డ్రోన్ల దాడులు జమ్మూ లో గల హెలికాప్టర్, విమానాల గోదామును ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవై ఉండవచ్చునని భావిస్తున్నారు. దాడి చెప్పుకోదగినది కానందున బేఫర్వాగా ఉండడం సరైనది కాదు. ఈ రెండు డ్రోన్లను సరిహద్దులకు ఆవల నుంచి ప్రయోగించారని అవి ఎయిర్ ఫోర్స్ కేంద్రంపై బాంబులు వేసి వెళ్లిపోయాయని నిఘా వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. కూలంకషమైన దర్యాప్తు జరిపి వాటిని ఎక్కడి నుంచి ఎవరు ప్రయోగించారో తెలుసుకోవలసి ఉంది. లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్ర మూకలు అక్కడ సంచరించే అవకాశముంది.
కశ్మీర్ సరిహద్దుల్లో ఏది జరిగినా వెంటనే చూపుడు వేలు పాకిస్తాన్ వైపు తిరగడం సహజం. అందుకే ఈ దాడులపై నిజ నిర్ధారణ నిజాయితీగా జరగాలి. ఎంతో కాలం తర్వాత ఎన్నో ఉద్రిక్తతలు, ప్రాణ నష్టాలు సంభవించిన అనంతరం ఇటీవలే లోపాయికారీ చర్చలు ఫలిస్తూ భారత పాకిస్తాన్లను చేరువ చేస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. కశ్మీర్ సరిహద్దుల్లో ఆధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి రెండు వైపుల తుపాకులు నిశ్శబ్దం పాటిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి దాడులు రెండు దేశాల మధ్య మళ్లీ అనుమానాలకు, అంతరాలకు దారి తీయకూడదు. ఈ దాడులు నేరుగా మన వాయు సేన స్థావరాన్ని గురి పెట్టి జరిగాయి కాబట్టి వీటికి ఎంతో ప్రాధాన్యముంది. వాస్తవానికి పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను, బాంబులను పంజాబ్, జమ్మూ కశ్మీర్ భూభాగాల్లోకి పంపించడం దాదాపు ఏడాదిగా సాగుతూనే ఉంది. గత డిసెంబర్‌లో పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలో పాక్ వైపు నుంచి ప్రయోగించిన ఒక డ్రోన్ 11 చేతి బాంబులను వదిలి వెళ్లింది.
అంతకు ముందు రోజు అదే జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో చక్రి సైనిక పోస్టు వద్ద ఒక డ్రోన్ కనిపించింది. దానిని వెనక్కి పంపించడానికి సరిహద్దు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఆ ప్రాంతంలో సాగిన సోదాల్లో కూడా 11 హ్యాండ్ టేఠెగెనేడ్లు ఉంచిన చెక్క పెట్టె దొరికింది. మనుషులుండని చిన్న చిన్న డ్రోన్లు కొంత బరువు గల సామగ్రిని మోసుకొని గమ్యాలకు చేర్చడం లేదా లక్షాన్ని ఛేదించడం చాలా కాలంగా జరుగుతున్నది. ఈ డ్రోన్ల వ్యవస్థను మెరుగుపరిచి యుద్ధ లక్షాలను దెబ్బ తీయడానికి వినియోగించడం మొదలైంది. భారీ ట్యాంకులు, అత్యాధునిక యుద్ధ విమానాలు, సుశిక్షిత అసంఖ్యాక సైనికులు చేయలేని పనిని ఇవి సాధిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ గత ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు జరిగిన అజర్‌బైజాన్ ఆర్మేనియా యుద్ధమే. ఇక యుద్ధాలు భారీ ఆయుధాలతో గాక చిన్న పాటి డ్రోన్లతో జరిగే శకానికి తెర లేవనున్నదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990ల యుద్ధంలో అజర్‌బైజాన్‌ను చిత్తుగా ఓడించిన ఆర్మేనియా గత ఏడాది జరిగిన నోగోర్నో కరబాక్ యుద్ధ క్షేత్రంలో కేవలం డ్రోన్ దాడుల కారణంగా ఓటమిని చవిచూసింది.
టర్కీలో, ఇజ్రాయెల్‌లో తయారైన అత్యాధునిక డ్రోన్లను ఉపయోగించి ఆర్మేనియాను అజర్‌బైజాన్ మట్టి కరిపించింది. ముందు ముందు అన్ని దేశాలూ డ్రోన్ల యుద్ధానికి సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ సాయుధ యుద్ధ వాహనాలతో గెలుపొందడం కంటే కొన్ని సందర్భాల్లో డ్రోన్లతో దానిని సాధించడం సులువని చెబుతున్నారు. ఒకే ఒక్క చోదక ఇంజినుండే రెండు రెక్కలు గల ఒక చిన్న విమానాన్ని (బై ప్లేన్) ఒకే సారి వాడి వదిలేసే డ్రోన్‌గా తయారు చేసి ఆర్మేనియా దళాలను అజర్‌బైజాన్ కకావికలు చేసింది.యుద్ధం చేస్తున్న సైనికులకు డ్రోన్లు ఎటు నుంచి ఎలా వచ్చి తమను ఢీ కొంటాయో తెలియని అయోమయావస్థ నెలకొంటుంది. భారత సైన్యం వద్ద ఎంతటి బలమున్నా డ్రోన్ల అండ తక్కువేనని చెబుతున్నారు. ఈ వైపుగా ఆలోచించి ఈ దళాన్ని చేకూర్చుకోవలసిన అవసరం స్పష్టంగా కనిపిస్తున్నది.
చాలా యుద్ధాలు గెలిచిన వారెవరో, ఓడిపోయినవారెవరో ఖచ్చితంగా గిరిగీసి చెప్పుకోలేని రీతిలో ముగుస్తుంటాయి. కాని ఆర్మేనియా అజర్‌బైజాన్ యుద్ధంలో డ్రోన్ల ప్రయోగం వల్ల విజేత అజర్‌బైజానేనని స్పష్టంగా తెలిసింది. టర్కీకి డ్రోన్ల విక్రయంపై అమెరికా, నాటోలు ఆంక్షలు విధించిన తర్వాత అది స్వయంగా వాటిని డిజైన్ చేసి ఉత్పత్తి చేయడం గమనించవలసిన విశేషం. ఆ డ్రోన్లు ఒక యుద్ధాన్ని నిర్ణయాత్మకంగా ముగింపుకి తేవడం మరో చెప్పుకోదగిన పరిణామం. అందుచేత చిన్నవని డ్రోన్ల అవసరాన్ని గుర్తించకుండా ఉండడం మంచిది కాదు. యుద్ధ క్షేత్రంలో డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇతర భారీ ఆయుధాలకు కాలం చెల్లిందని కూడా భావించకూడదు.