పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలు పూర్తి కాకముందే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు ఈ స్టార్ హీరో. దాదాపుగా రెండేళ్ల క్రితమే ఈ సినిమా ప్రకటన వచ్చినా కూడా కరోనా కారణంగా ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్‌కు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకునేందుకు కావాల్సినంత సమయం దక్కింది.
ఇక స్క్రిప్ట్ వర్క్ లో క్రిష్ నుండి మొదలుకుని పవన్ కళ్యాణ్ వరకు భాగస్వామ్యం అయ్యారని ఇండస్ట్రీ వర్గాల టాక్. హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో పవన్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ను మించిన మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ఈ సినిమాలో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ప్రకాష్ రాజ్ ఉంటాడని.. ఆయన పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. విలన్ గానా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగానా అనే విషయంలో స్పష్టత లేదు.
కానీ ఖచ్చితంగా పవన్‌తో ప్రకాష్ రాజ్ చేయబోతున్న ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. బద్రి, వకీల్ సాబ్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌ల కాంబో సినిమాకు రిపీట్ కావడం ఖాయమంటూ యూనిట్ సభ్యులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో ‘గబ్బర్ సింగ్’లా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్న అభిమానులకు ప్రకాష్ రాజ్ ఎంట్రీ మరింత నమ్మకాన్ని కలిగిస్తోంది.