శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని మలూరా పరింపొరాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో పాక్ ఉగ్రవాది, లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలు, స్థానిక పౌరులపై కాల్పులు జరిపి పలువురిని పొట్టన పెట్టుకున్న అబ్రార్‌ను భదత్రా బలగాలు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో భాగంగా ఎకె-47 రైఫిల్‌ను ఇంట్లో దాచిపెట్టానని అబ్రార్ తెలపడంతో అక్కడికెళ్లిన భద్రతా బలగాలపై మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. పారిపోతున్న అబ్రార్ పై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు ఘటనా స్థలంలోనే చనిపోయారని ఐజెపి విజయ్ కుమార్ తెలిపాడు. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, ఎకె-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.