శ్రీనగర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజావనీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం మూడు డ్రోన్లు కనిపించాయి. మిలటరీ కేంద్రాల సమీపంలోనే డ్రోన్లు కనిపించడంతో సైన్యం అప్రమత్తమైంది. గడచిన నాలుగురోజులుగా జమ్మూ నగరంలో మిలటరీ స్థావరాల వద్ద డ్రోన్లు లభించాయి. మిలటరీ కేంద్రాల వద్ద ఇప్పటివరకు 7 డ్రోన్లు లభించాయి. ఈ డ్రోన్ల మిస్టరీని ఛేదించడానికి సైన్యంతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు రంగంలోకి దిగారు. జమ్మూలో మంగళవారం కూడా డ్రోన్లు సంచరించినట్టు వార్తలొచ్చాయి. అయితే, సైన్యం దీనిపై అధికారికంగా స్పందించలేదు. జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌దోవల్ పాల్గొన్నారు. డ్రోన్ల దాడి నేపథ్యంలో సైన్యానికి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడంపై సమావేశంలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎదురు కానున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా సాంకేతిక వనరులను సమకూర్చుకోవడంపై సమాలోచనలు సాగిస్తున్నారు.