Sunday, November 17, 2024

లంచం కింద తాళిబొట్టు!

- Advertisement -
- Advertisement -

తాళిబొట్టు తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి కట్టి నిరసన తెలిపిన బాధితురాలు
రుద్రంగి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఘటన

రుద్రంగి : తాళి బొట్టు తీసుకొనైనా తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళా రైతు రెవెన్యూ అధికారులను వేడుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు మంగ తెలిపిన వివరాల ప్రకారం… రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం 22 సంవత్సరాల క్రితం దుబాయి వెళ్లాడు. నేటికి అతని ఆచూకీ లేదు. అయితే మామ రాజలింగం పేరుపై మానాల గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 130/14లో 2ఎకరాల భూమి ఉంది. ఈ భూమి 2015 నుండి 2016 వరకు రెవెన్యూ రికార్డు సక్రమంగా ఉండగా, మామ రాజలింగం సైతం మరణించాడని తాము ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉపాధి నిమిత్తం మెట్‌పల్లిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పని చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పింది.

అయితే స్థానికంగా తాము ఎవరూ లేకపోవడంతో తన బంధువులకు 2016లో అన్యాయంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారని ఆరోపించింది. అక్రమంగా తమ భూమిని వేరొకరికి చేసిన పట్టాను రద్దు చేసి తమ భూమిని తమ పేరున పట్టా మార్చాలని గత రెండు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీనిపై గత సంవత్సరం జూన్ నెలలో రెవెన్యూ డివిజన్ అధికారికి ఫిర్యాదు కూడా చేశానని, దీనిపై ఇప్పటివరకు తనకు ఎలాంటి న్యాయం చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టును తీసుకుని తన భూమిని తన పేరున పట్టా మార్చి న్యాయం చేయాలని తాళి బొట్టు కార్యాలయ గుమ్మానికి వేసినట్లు బాధితురాలు తెలిపింది. జరిగిన ఘటనపై రుద్రంగి ఎమ్మార్వో వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా, ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News