న్యూఢిల్లీ : కరోనా బాధితుల్లో ఐదుగురిలో సైటోమెగాలో వైరస్ (సిఎంవి) సంబంధిత మలద్వార రక్తస్రావం కనిపించింది.న ఢిల్లీ లోని సర్‌గంగారామ్ ఆస్పత్రిలో ఈ కేసులు బయటపడ్డాయి. రోగనిరోధక సామర్ధం సాధారణం గానే ఉన్న వారిలో ఈ సమస్య వెలుగు చూడడం ఇదే మొదటిసారని, బాధితుల్లో ఒకరు చనిపోయారని వైద్యులు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ గా తేలిన దాదాపు 30 రోజుల తరువాత వీరిలో ఈ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించాయి. ఇప్పటివరకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్, ఎయిడ్స్ బాధితులతోపాటు అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. అయితే ఎలాంటి సమస్య లేని ఆరుగురిలో సిఎంవి ఇన్‌ఫెక్షన్ కనుగొన్నట్టు గంగారామ్ ఆస్పత్రికి చెందిన ప్రొఫెసర్ అనిల్ అరోడా చెప్పారు.
బాధితుల్లో కడుపు నొప్పి, మలవిసర్జన సమయంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్, దాన్ని నయం చేయడానికి స్టెరాయిడ్లు వంటివి ఇవ్వడం వల్ల వీరిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని ఫలితంగా ఇలాంటి రుగ్మతలు తలెత్తవచ్చని తెలిపారు. దేశ జనాభాలో 80 నుంచి 90 శాతం మందిలో సాధారణంగా సిఎంవి ఉంటుందని, అయితే రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఆ వ్యాధి లక్షణాలు కనిపించవన్నారు. తాజాగా వెలుగు చూసిన కేసుల్లో ఇద్దరికి తీవ్రస్థాయి రక్తస్రావం జరిగిందని, వీరిలో ఒకరికి అత్యవసర శస్త్రచికిత్స చేసి పెద్ద పేగులో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. మరొకరు తీవ్ర రక్తస్రావం, కొవిడ్ వల్ల చనిపోయారని పేర్కొన్నారు. మిగతా వారు గాన్సిక్లోవిల్ యాంటీవైరస్ ఔషధంతో కోలుకున్నారని తెలిపారు.
CMV infection in Covid-19 victims