నేటి నుంచి పది రోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
కార్యక్రమాలను సమీక్షించేందుకు సిఎం కెసిఆర్ ఆకస్మిక తనిఖీలు
మొక్కలు నాటి హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి
7వ విడత హరితహారంలో 19.91 కోట్ల మొక్కలు నాటాలని లక్షం
4వ విడత పల్లె, పట్టణ ప్రగతిలో మెరసిపోనున్న ఊర్లు, నగరాలు
గ్రామాల్లోనే మంత్రి ఎర్రబెల్లి, సంబంధిత ఉన్నతాధికారుల బస
మన తెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల హరితోత్సవం (హరితహారం) జరగనుంది. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా జరగనుంది. హరితహారంలో కనిపించిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటనుండగా, పల్లె, పట్టణ ప్రగతిలో చిన్న చెత్త కాగితం సైతం కనిపించని విధంగా పారిశుద్ధ కార్యక్రమలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఇటీవలే సంబంధిత అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ మేరకు కార్యక్రమాలను తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సిఎం కెసిఆర్ సైతం స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఆకస్మిక తనిఖీలు చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉండగా సిఎంఒ కార్యాలయం కూడా వీటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఆయా కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సిఎంకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు సైతం పల్లె, పట్టణ, హరితహారం కార్యక్రమాల్లో ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా సంబంధిత అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుద్ధం, మౌలిక సదుపాయల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. గ్రామాల్లో చెడిపోయిన బావులను పూడ్చివేస్తారు. ముళ్ల కంపలను తొలగిస్తారు. నిండిన డ్రైనేజీలను, నాలాలను సక్రమంగా క్లీన్ చేస్తారు. పెద్దఎత్తున పూడిక తీతపనులు చేపడతారు. ఇళ్ల మధ్య వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేస్తారు. స్మశాన వాటికలను సైతం చక్కటి పూలమొక్కలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతారు. ఒక విధంగా చెప్పాలంటే గ్రామాలు, పట్టణాలను అన్ని విధాలుగా మెరిసే విధంగా, సరికొత్త వాతావరణం కనిపించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇక సీజనల్ వ్యాధులు సైతం ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పెద్దఎత్తున పారిశుద్ధ కార్యక్రమాలు సాగనున్నాయి. గ్రామాల్లో ఈ పనులను పర్యవేక్షించేందుకు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులంతా ఊళ్లలోనే బస చేసేందుకు తగు ఏర్పాట్లు చేసుకున్నారు. పది రోజుల్లో మంత్రి ఎర్రబెల్లి సుమారు 25 జిల్లాల్లోని నిర్వహించే గ్రామ సభల్లో పాల్గొనున్నారు. స్థానిక సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకునే వేదికగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు.
కాగా హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్రం దిశగా పరుగులు తీస్తోంది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న లక్షంతో సిఎం కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఆరు విడతలుగా జరగగా గురువారం నుంచి ఏడవ విడత మొదలు కానుంది. ఈ విడతలో సుమారు 19.91 కోట్ల మొక్కలను నాటనున్నారు. ఈ యజ్ఞంలో భాగస్వామలు అయ్యేందుకు సిఎం కెసిఆర్ నుంచి మొదలుకుని సామాన్య ప్రజల వరకు సిద్ధంగా ఉన్నారు. కాగా ఏడవ విడతలో భాగంగా హైదరాబాద్‌లో మొక్కలు నాటి హరితహారంను మంత్రి కెటిఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఎ సంస్థ అభివృద్ధి చేసిన పెద్ద అంబర్‌పేట్ కలాన్‌లో అర్బన్ ఫారెస్టు పార్కును ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకరానున్నారు.
Haritha Haram program to begin from today in Telangana