14.2 కిలోల సిలిండర్‌పై రూ. 25 భారం
రేపటి నుంచి అమల్లోకి రానున్న ధరలు
హైదరాబాద్: నగరంలో ఓ వైపు నిత్యావసర సరుకులు ధరలు భగ్గుమంటుండగా, మరోవైపు చమురు ధరలు సామాన్య ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా వంటింట్లో ఉండే గ్యాస్ బండపై మరో ధరల పిడుడు వేసింది. గత కొద్ది రోజులుగా వంటగ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 25, వాణిజ్య సిలిండర్‌పై రూ. 84 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఆరు నెలల్లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 140 పెరిగింది. దీంతో రాజధాని డిల్లీ, ముంబాయిలో రూ. 834.50లకు చేరింది. హైదరాబాద్ నగరంలో గృహావసరాలకు ఉపయోగించే సిలిండర్ ధర రూ. 887, వాణిజ్య సిలిండర్ ధర రూ. 1768కి పెరిగింది. ఇప్పటికే పెట్రోల్ ధరలతో ఆర్దిక ఇబ్బందులు పడుతోన్న సామాన్యుడిని గ్యాస్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఈఏడాది ఫిబ్రవరి 4న తొలిసారిగా సిలిండర్ ధరను రూ. 25 పెంచగా, అదే నెల 15న మరో రూ. 50లు 25వ తేదీన రూ. 25 పెరిగింది. అదే నెలల్లో రూ. 100 పెంచింది. ఇక మార్చి 1న మరో రూ. 25లు పెంచారు. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో ఏప్రిల్ 1న వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 10 తగ్గించి వినియోగదారులకు ఊరట కలిగించింది. తాజా పెరిగిన ధరలతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలపు పెంపుతో సామాన్యుడి జీవించడం కష్టమని పేర్కొంటున్నారు.