హైదరాబాద్: ఎపి సిఎం జగన ఆర్‌డిఎస్ నుంచి దృష్టి మళ్లించడానికే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలు మోహరించాలని అంటున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చుకుందామని, సుప్రీం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుందామని జగన్ గతంలో చెప్పలేదా? అని నిలదీశారు. కొత్తగా కేటాయింపులు జరగనిదే జగన్ ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు. ఉమ్మడి ఎపిలో జారీ చేసిన జివొల ప్రకారమే తాము కృష్ణా జలాలపై ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు అక్రమమైతే అప్పటి జివొలు అక్రమమా అని ప్రశ్నించారు.
ఎపికి 30 శాతం కేటాయింపులు ఉంటే 60 శాతం నీళ్లు వాడుకునేందుకు అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. కేంద్ర స్థాయిలో పరిష్కరించుకుందామని జగన్ అంటే అనుమానం కలుగుతోందని, కేంద్రంతో జగన్ కుమ్మక్కై అక్రమ ప్రాజెక్టులు కట్టాలని ఉద్దేశమా? అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు.
హైదరాబాద్‌లోని సీమాంధ్రుల క్షేమంపై జగన్‌ది అనవసర ఆవేదన అని, ఉద్యమ సమయంలో తాము సెటిలర్లు అనే పదం వాడలేదని, తాము కడుతున్న ప్రాజెక్టులన్నీ సరైనవేనని, శ్రీశైలం జల విద్యుత్‌పై ఎపిది అనవసర రాద్ధాంతమని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారని, అవసరమైతే ప్రధాని మోడీని కలిసి న్యాయం చేయమని అడుగుతామన్నారు. జగన్ లేఖలో కోరినట్టు వివాదాన్ని కెఆర్‌ఎంబి పరిధిలోని తేవొద్దన్నారు. ఎపి ప్రాజెక్టులు ఆపుతామని, తెలంగాణ ప్రాజెక్టులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.