‘సాయుధ ప్రతిఘాత శక్తులపై సాయుధ విప్లవ పోరాటం చేశాం, సామ్రాజ్య వాదం, ఫ్యూడలిజం, అధికార వర్గ పెట్టుదారీ విధానం అనే మూడు కొండలను కూల్చాం. ప్రజా రిపబ్లిక్ చైనాను నెలకొల్పి ప్రజలనే దేశ పాలకులను చేశాం, ప్రజా విముక్తిని సాధించాం… తూర్పున అత్యధిక జనాభాతో నిరుపేద వెనుకబడిన దేశంగా ఉన్న స్థితి నుంచి జాతీయ పునరుజ్జీవనానికి అవసరమైన మౌలిక రాజకీయ పరిస్థితులను, సంస్థాగత పునాదులను నెలకొల్పుకున్న సోషలిస్టు దేశంగా మార్చుకోగలిగాం… పాత ప్రపంచాన్ని ధ్వంసం చేసి కొత్త దానిని నిర్మించుకోడమే గాక సోషలిజం ఒక్కటే చైనాను కాపాడగలదని, చైనా లక్షణాలు గల సోషలిజం మాత్రమే చైనాను అభివృద్ధి చేయగలదని రుజువు పరిచాం… సాపేక్షికంగా వెనుకడిన ఉత్పాదక శక్తులతో కూడిన దేశాన్ని ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా మార్చగలిగాం, కేవలం ఏ పూట కూడును ఆ పూట వెతుక్కునే స్థితిలోని ప్రజల అత్యల్ప జీవన ప్రమాణాలను ఎంతో మెరుగ్గా, సుఖంగా బతకగలిగే స్థాయికి చేర్చగలిగాం… మార్కిజాన్ని చైనా పరిస్థితులకు అన్వయించి అమలు పరచడాన్ని కొనసాగిద్దాం… తైవాన్ సమస్యను పరిష్కరించడం, చైనా పరిపూర్ణ పునరైక్యతను సాధించడం, ఒకే చైనాను పునరుద్ధరించడం మన మొక్కవోని లక్షం… మాతో పెట్టుకొనే ఎవరికైనా తగిన బుద్ధి చెబుతాం, మా జోలికొచ్చేవారు చైనా ఉక్కు గోడకు తలలు బాదుకోవలసిందే’ రాజకీయ స్వేచ్ఛను, పారదర్శకతను, ప్రజాస్వామిక హక్కులను కోరుతూ తిరుగుబాటు చేసిన విద్యార్థి వీరులను 1989లో నిర్దాక్షిణ్యంగా కాల్చివేసి వారి తిరుగుబాటును అణచివేసిన తియానన్మెన్ స్కేర్ వద్ద రెండు రోజుల క్రితం జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండగ వేదిక మీది నుంచి ప్రసంగిస్తూ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేసిన ఈ ఉద్ఘాటనలను తప్పు పట్టలేము.
ఆయన చెప్పిన వాటిలో అక్కడక్కడా కొన్ని అసత్యాలు, అర్ధసత్యాలు ఉంటే ఉండవచ్చుగాని మొత్తంగా చూసినప్పుడు చైనా సాధించిన విజయాలు అసాధారణమైనవి, అనితరమైనవి అని అంగీకరించక తప్పదు. అగ్ర రాజ్యం అమెరికాను సవాలు చేసే స్థితికి దేశాన్ని అభివృద్ధి చేసిన గొప్ప చరిత్రను చైనా కమ్యూనిస్టు పార్టీ మూట గట్టుకున్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. 85 కోట్లకు మించిన ప్రజలను కటిక దారిద్య్రం నుంచి, నిరుపేదరికం నుంచి చైనా విముక్తం చేయగలిగిందని ప్రపంచ బ్యాంకే ఒప్పుకున్నది. 1981లో 88 శాతంగా గల చైనా పేదరిక రేటు 2015 నాటికి 0.7 శాతానికి పడిపోయిందంటే ఆ పార్టీ 70 ఏళ్ల అవిచ్ఛిన్న పాలన, సారథ్యం నేడు ఆ జాతిని ఎంత సమున్నత స్థితికి తీసుకు వచ్చిందో తెలుస్తున్నది. అయితే ఈ మహత్తర లక్ష సాధనలో ఆ పార్టీ నాయకత్వం విధించిన కఠిన క్రమశిక్షణకు అక్కడి ప్రజలు ఎన్ని స్వేచ్ఛలను కోల్పోవలసి వచ్చిందో అన్నది కూడా విస్మరించదగిన విషయం కాదు.
ఈ ఖ్యాతి ప్రాథమికంగా మావో జెడాంగ్‌కు చెందుతుంది. ముందుగా అత్యంత దారిద్య్రంలో మగ్గుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాల మీద దృష్టిపెట్టి అక్కడి జనాన్ని పట్టణాల్లో నిర్మించిన అపార్టమెంట్లలోకి తరలించడం ద్వారా చైనా నాయకత్వం ప్రజల్లో క్రమశిక్షణను, పని పట్ల అసాధారణమైన నిబద్ధతను తీసుకురాగలిగింది. ‘అనుమానం లేదు, గత 40 ఏళ్లలో చైనాలో అద్భుతమే జరిగింది’ అని ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త డేవిడ్ రెనీ అన్నారు. అయితే ఈ విజయం కేవలం ప్రభుత్వానిదే కాదని చైనా ప్రజలు కష్టపడి పని చేసి తమంత తాము దారిద్య్రంలోంచి బయటపడ్డారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అంతకు ముందు దుర్భరమైన పేదరికంలో శతాబ్దాలు గడిపింది కూడా ఆ ప్రజలే కదా అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. అందుచేత చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషిని తక్కువ చేసి చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. 1949లో పీపుల్స్ చైనాను అవతరింప చేసిన మావో 1950ల నుంచే దేశాన్ని పారిశ్రామికంగా మార్చడం ప్రారంభించాడు. ప్రపంచ బ్యాంకు నిర్ధారణను బట్టి చైనా ఇప్పుడు పై మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశం.
చైనా కమ్యూనిస్టు పార్టీ కంటే వయసులో పెద్దదైన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్య్రాన్ని సాధించింది. స్వాతంత్య్రానంతర పాలనలో ఎక్కువ కాలం దేశాన్ని అదే పాలించింది. కాని చైనాతో పోల్చుకుంటే మనం దానికి చాలా దూరంలో ఉన్నాం. కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ గత ఏడేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న తీరు ఎంత గొప్పగా ఉందో కళ్లముందున్న కఠోర సత్యమే. చైనా కంటే మనం పై చేయిలో ఉన్నది ప్రజాస్వామ్య స్వేచ్ఛల విషయంలోనే అని సంతృప్తి పడదామనుకుంటే ఇప్పుడు వాటికి కూడా అపూర్వమైన ముప్పు వాటిల్లుతోంది. తా మెవరి జోలికీ వెళ్లం, ఎవరైనా తమ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతాం అని జీ జిన్‌పింగ్ పలికిన పలుకులు చైనా బల దురహంకార జ్వరంతో ఊగిపోతున్న విషయాన్ని చాటుతున్నది. అందుచేత మనం అన్ని విధాలా జాగరూకతతో ఉండాలి. చైనాకు దీటుగా తయారు కావాలి.