Saturday, November 16, 2024

రచనకు పుష్టి మెరుగుదలతోనే

- Advertisement -
- Advertisement -

Final improvement to writing becomes Poet's' skill

సాహిత్య ప్రక్రియ ఏదైనా సృజన స్థాయిలో వాటి వస్తుశిల్పాల పట్ల సాహిత్యవేత్తలు పాటించే ’జాగరూకత ( heed )’ వల్ల అవి ఉత్తమ రచనలుగా రూపుద్దుకుంటాయి. సృజనలో పాటించే జాగరూకత మూలాన్నే రచన లక్ష్యాన్ని, ఔచితిని కవులు రచయితలు సాధించగలుగుతారు. ’ఇంప్రువైజేషన్/ క్రాఫ్ట్’ అని లిటరరీ క్రిటిసిజంలో పాశ్చాత్యులు చెపుతున్న మాటలు కూడా జాగరూకతలో భాగమే. జాగరూకతకు పర్యాయపదాలైన శ్రద్ధాసక్తులతో రచనకు దిద్దే తుది మెరుగులే కవులు రచయితల తాలూకు ’ నైపుణ్యం (skill) అవుతుంది. అందుకే మన ప్రాచీనులు ఉత్తమ కళాఖండాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ‘ రాగేన విద్యతే చిత్రం నచ భూమౌ, నచ భాజనే‘ అన్నారు. మంచి చిత్తరువు అనేది రంగుల్లోనో, వాటిని మిశ్రమం చేసే పాత్ర(pot)లోనో, గీసే పలకలోనో కాగితంలోనో ఉండదు; చిత్ర కారుని నైపుణిలో ఉంటుంది . కాబట్టి రచనా గాఢతకై పుష్టికై కళాత్మకతకై కవులు రచయితలు అనేక ప్రాతిపదికల్లో కృషి సలపవలసివుంది. ఇందుకోసం ఇతివృత్తం పరంగా, ఇతివృత్తంలోని పరిసరాల పరంగా, తాము విశ్వసించే భావజాలం పరంగా, చెప్పి తీరవలసిన సామాజికాంశాల పరంగా, ప్రదర్శించ వలసిన రచనా కౌశలాల పరంగా ఎన్నో మెళకువలు కవులు రచయితలకు అవసరమవుతాయి.

రచనా కళలో వ్లదిమీర్ మయ్కావస్కీని అత్యుత్తమ, అత్యంత ప్రతిభాశాలి కవిగా సోవియట్ ప్రజలు కీర్తించారు. సృజన రంగంలో ఆయన ఉద్ధండతను వింగడిస్తూ ‘ శ్రోతలను ముట్టడించి వారితో చెల్లాటలాడి, విసిగించి, కోపింపజేసి, తన్నుకొని పోదలచుకున్న చోటికి వారిని చేర్చగలిగే కళ ,నాకు తెలిసినంతమట్టుకు మయ్కావస్కీకి చేతనయినట్టు,అనితర సాధ్యం ( మయ్కావస్కీ :విప్లవ కవి-కిన్నెర సాహిత్యం సంపుటం 4, పుట:1500)‘ అంటారు కె.వి.రమణారెడ్డి. అనితర సాధ్యమైన శిల్ప నిర్వహణ,తనకే సొంతమైన వస్తు సంవిధానం ఎవరి రచనలోనైతే ప్రస్ఫుటం అవుతుందో అటువంటి కవులు రచయితలు పది కాలాల పాటు పాఠకుల మనస్సులో ఉండిపోతారు. ఉత్తమ రచనల పట్ల, ఉత్తమ రచయితల పట్ల సాహితీలోకం యధారీతి గౌరవ ప్రపత్తులను ప్రకటిస్తుంది కూడా. ఒక రచన కళా గౌరవాన్ని శాస్త్ర ప్రతిపత్తిని పొందేది ఆ సాహిత్య వేత్తకున్నటువంటి మెరుగు పరచే శక్తి సామర్థ్యం వల్లనే అని వర్ధమాన కవులు రచయితలు గుర్తెరగాల్సివుంది.

స్థల కాలాలకు లోబడే సాహిత్యంలో నూత్న ప్రక్రియలు వెలుగుచూస్తాయి. అయితే సాహిత్యంలో ఏ ప్రక్రియకు ఆ ప్రక్రియ విడిగా దేనికదే ప్రత్యేకమైంది. Context లేకుండా Text ఉండదంటారు గదా. సందర్భానుసారం రచయితలు చేపట్టిన ప్రక్రియ ఏదైనా దానిలో ఒదిగే పౌరాణిక, చారిత్రక, సాంఘిక ఇతివృత్తాలకు వాటి నిడివి, పరిమితులూ ఉంటాయి. ఇతివృత్తంలో ఆవిష్కృతమయ్యే పరిసరాలు, వాతావరణం, కథాక్రమం అందులోని పాత్రలను, పాత్ర చిత్రణను నిర్ధేశిస్తాయి. రచనలో అంతర్లీనంగా రచయిత తాను చెప్పదలచుకున్న సందేశానికి, పాఠకులు గొంతు కలపవలసిన చైతన్యానికి అనుసంధానమై సన్నివేశ కల్పన ఉంటుంది. సన్నివేశ కల్పనలు సైతం ఇతివృత్తం లోపలి మార్పు చేర్పులకు, తదనుగుణ పాత్రలు రూపొందడానికి కారణమవుతాయి. పదిహేడో శతాబ్దపు ఐరోపా సాహిత్యంలో మనకు ఈ రకమైన పాత్రచిత్రణకు ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. దీని ప్రభావాన్ని మనం ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ చూస్తాం.

ఒక రచన ’ రాత ప్రతి (codex)’ గా రూపుదాల్చే క్రమంలో వస్తు పరంగా ఇంత తతంగం అవసరపడుతుందా అనే ప్రశ్న కూడా ఒకటి మనలో ఉత్పన్నం కాకమానదు. ఇందుకు సమాధానం ప్రముఖ స్కాటిష్ చిత్రకారిణి Lesley Birch చెబుతున్నట్టు ‘Creative thinkers and makers provide their communities with joy, interaction, and inspiration, but they also give thoughtful critique to our political, economical, and social systems – pushing communities to engage thoughtfully for and make steps toward social progress ‘( What Is the Artist’s Role in Society: artwork archive.com), కవులు రచయితలు కళాకారులుగా సమాజంలో తాము నిర్వహించదలచుకున్న పాత్రలో దొరుకుతుంది.దృష్టిబట్టి సృష్టి ఉంటుందన్నది ఇందుకే. తాము ఎంచుకున్న ఇతివృత్తానికి ఏ దృక్పథాన్ని జొప్పిస్తే అదే రచన నిండా వెలుగు చూస్తుంది. దృక్పథం విషయంలో సాహిత్యవేత్తలకు ప్రధానంగా ఉండాల్సింది స్థల కాల స్పృహ.

సాహిత్యం, రాజకీయాలు, సంస్కృతి ఈ మూడూ నిరంతరాయంగా ఒక దాన్నొకటి పెనవేసుకున్న ప్రభావితాంశాలు. ఈ పెనవేతలో దేన్ని ఏది ముందుగా కదిలిస్తుందో కొన్నిసార్లు చెప్పలేం. ఐతే ఏది దేని చేత ప్రభావితమైనా, పరస్పరం అనుబంధంగా ఉంటూ అనుకూల ప్రతికూలతలను ప్రకటించుకోవడం లోని వాటి అంతరార్థం(intertextuality), అంతరార్థ గమనం (dialogic way) అనేవి సృజన కారులకు అర్థం కావాల్సుంది. ఇవి అర్థం కాకుండా స్థల కాల స్పృహ బలపడదు.అందుకే కవులు రచయితలకు సాహిత్యంతోపాటుగా రాజకీయాలు, సంస్కృతి సంబంధ విషయాల్లో అవగాహన తప్పనిసరైన ఒక అవసరం.ఈ అవసరాన్ని అధ్యయనం మాత్రమే తీర్చగలదు. అధ్యయనంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచినప్పుడే దృక్కోణంలో స్పష్టత ( clarity of point of view ) వస్తుంది. శైలిని బట్టి రచనను ఒకే కోణం నుండి చెప్పే సాధారణ మార్గాన్ని రచయిత అనుసరించవచ్చు.అట్లా కాకుండా రచయితే ప్రధాన పాత్ర అయినప్పుడు మరొక ఎంపిక ఉంటుంది.అదే బహుళ కోణాల (multiple point of views) నుండి రాయడం.

అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రల కోణం నుండి చెప్పడం. కథ నవల నాటకం ఆత్మకథల వంటి ప్రక్రియల్లో మనకు బహుళ దృక్కోణాలు అగుపిస్తాయి. రచనలో వ్యక్తమయ్యే దృక్కోణం లేదా దృక్కోణాలే రచయితలకున్న కాలస్పృహను విశదపరుస్తాయి. ఇక స్థలం విషయానికొస్తే, పాత్రలనూ ఇతివృత్తాన్ని బట్టి వైయక్తికం, సామూహికం. రచయిత నిర్వహించే ఇతివృత్తంలో పాత్రలకు సంబంధించి అది ఇల్లు, ఊరు,నగరం, ప్రాంతం, దేశం స్థలం ఏదైనా కావచ్చును. ఏ స్థలం పాఠకులను విడవకుండా అనుభవైక్యమై ఉంటుందో, దాని బాహిరంతర స్వరూపాలు ఆసాంతం రచనలో ప్రతిబింబించినట్లైతే ఆ రచయితకు స్థల స్పృహ ఉన్నట్టు లెక్క. స్థల స్పృహ నుండే స్థల కోణం లేదా స్థల భావం ( sense of place )ఆవిష్కృతం అవుతుంది. ఇది ప్రాదేశిక సందర్శనం లేదా ప్రాదేశికాధ్యయనం లోని శ్రద్ధతోనే సాధ్యపడుతుంది. రచనకు అంతర్గతంగా సొగసులద్దే దినుసు,కారకం స్థల కాల స్పృహే. అందుకే కవులు రచయితలకు స్థల కాలాల మీద విశేష పరిజ్ఞానం ఉండితీరాలి. ఇక్కడ సుప్రసిద్ధ రచయిత్రి , ప్రజోద్యమకారిణి అరుంధతీరాయ్ మనదేశపు వర్తమాన స్థితిని గురించి చేసిన వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి.

‘ ప్రతి రచయితా రచనలు చేయడానికి మన దేశం మన కాలం చాలా అనువైనవి. ప్రజలకు మద్దతునివ్వడం లేదా మద్దతును కోరే విషయంలో నాకైతఘ భారంగా ఏమీ అనిపించదు.ఒంటరిగా పోరాడటం,కొన్ని విషయాలపై చాలా స్పష్టంగా వ్యక్తీకరించే శక్తి రచయితలో ఉండటం ఇప్పుడు అత్యంత ప్రధానం ‘ ( The point of the writer is unpopular, thegaurdian.com: 17/6/ 2018) అని అంటారామె. స్థల కాల స్పృహ కు సంబంధించి రచనను తీర్చి దిద్దడానికి ఈ వ్యాఖ్య ఎంతో లోతైన ఆకరం.

ప్రజా సమూహాలనూ కలిపి ఉంచేది,విడిగా చూపేది కూడా సంస్కృతే. సంస్కృతి ప్రసాదించే వేరుబలం లోంచి పుట్టేవి రాజకీయాలు. సంస్కృతి, రాజకీయాల విస్తరణకు, మలుపులకు పాదులు వేసేది సాహిత్యం. ఒక జాతి ప్రజల సంస్కారం వాళ్ల సంస్కృతికి, చట్టాలు వాళ్ల రాజకీయాలకు, చైతన్యం వాళ్ల సాహిత్యానికి చెందుతాయి. సైన్సులో భాగంగా జ్ఞాన సముపార్జనలో భాగంగా చట్టాలు,సంస్కారం ఆదాన ప్రదానాలవుతాయి.కాని చైతన్యం అట్లా కాదు.అది స్థలీయం,కాలీనం.ముఖ్యంగా అక్కడి మనుషుల స్వభావానికి మాత్రమే చెందిన ఆలోచన,స్పందన మరియు ప్రతిస్పందన(temperament). దీన్ని సైన్సు ఇవ్వలేదు,సాహిత్యమే ప్రసాదిస్తుంది. ఓ సందర్భంలో విశ్వకవి రవీంద్రుడు ఇట్లా ‘ The real truth is that science is not man’s nature, it is mere knowledge and training.By knowing the laws of the meterial universe you do not change your deeper humanity.You can borrow knowledge from others, but you cannot borrow temperament.‘(Nationalism,NIYOGI BOOKS, page 48.) అంటారు.

రచన బతకడం, తద్వారా రచయిత బతకడం, జనబాహుళ్యంలోకి శీఘ్రగతిన చొచ్చుకుపోవడం, ఆదరణ పొందడం అది అందించే చైతన్యంతోనే. స్థల కాల స్పృహ నుంచి రాస్తున్న క్రమంలో ఆదాన ప్రదానాలుగా ప్రసరించే సంస్కృతి రాజకీయాల్లోకి సామ్రాజ్య వాదం(imperialism) ప్రవేశించి కవులు రచయితలను దారిమళ్లించే ముప్పూ పొంచి ఉంటుంది. ఇక్కణ్ణుంచే ప్రాథమిక జాగరూకత మొదలు కావాలి. భాషా పరమైన మెరుగుదల ఎంత అవసరమో, రచనకు సైద్ధాంతిక మెరుగుదల ప్రజా దృక్పథం అంతకు మించి అవసరం.ఇంప్రువైజేషన్/ క్రాఫ్ట్ లో తాత్విక పునాదిని, సైద్ధాంతిక ప్రాతిపదికను,స్థల కాల స్పృహలను పట్టించుకోకుండా కేవలం syntactic priming కే రచయిత పరిమితమైతే భాషా వ్యాయామంలో అతనో మేటి, అదో నిరర్థక రచన.

                                                                                              డా.బెల్లి యాదయ్య

                                                                                                9848392690

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News