ముంబయి: బిజెపితో తమ పార్టీ సంబంధాలు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్-కిరణ్ రావుల స్నేహంలాంటివని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ సమర్థించుకున్నారు. ఇటీవలే ఆమిర్-కిరణ్ రావులు విడాకులు పొందినా, కలిసే ఉంటామని ప్రకటించడం గమనార్హం. తమ మధ్య స్నేహం కొనసాగుతుందన్న అర్థంలో ఆమిర్, కిరణ్‌రావులు విడాకుల అనంతరం జంటగా వీడియో ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో బిజెపి నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తమ పార్టీలు(బిజెపి,శివసేన) శత్రువులు కాదంటూ ప్రకటన చేయడం రాజకీయ చర్చలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే సంజయ్‌రౌత్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
సుదీర్ఘకాలంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎలో భాగస్వామిగా కొనసాగిన శివసేన ప్రస్తుతం ఆ కూటమి నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్‌సిపి భాగస్వామ్యంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. బిజెపి, శివసేనలకు హిందూత్వ పార్టీలుగా పేరున్నది.భావజాలపరంగా పెద్దగా విభేదాలు లేని పార్టీలు రాజకీయంగా విడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమిర్-కిరణ్ రావులు విడిపోతారని కూడా ఎవరూ ఊహించలేదు. వారు విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామనడంతో తమదీ అలాంటి స్నేహమేనని రౌత్ పోల్చారు. అలాగని తాము మహారాష్ట్రలో మరోసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఊహించొద్దని రౌత్ అన్నారు. బిజెపితో తమ పార్టీకి విభేదాలున్నాయని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని రౌత్ అన్నారు. అయితే, తమ పార్టీలు భారత్, పాకిస్థాన్ లాంటివి కావన్నారు.
Shiv Sena-BJP Relations like Aamir-Kiran Rao: MP Sanjay raut