మహారాష్ట్ర మహిళకు అదృష్టం
ముంబై: కరోనా టీకా తీసుకుంటే చాలామందికి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. కానీ, మహారాష్ట్రలోని ఓ మహిళకు వ్యాక్సిన్ వేసుకోగానే ఎప్పుడో పోయిన కంటిచూపు తిరిగొచ్చింది. జాతీయ మీడియా వార్తా కథనం ప్రకారం.. వాసింకు చెందిన 70ఏళ్ల మహిళ మధురాబాయి బిదవే తొమ్మిదేళ్ల కిందట కాటరాక్ట్ శస్త్ర చికిత్స చేయించుకుంది. అయితే ఈ చికిత్సతో పూర్తిగా చూపుకోల్పోయింది. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డ తర్వాత ప్రభుత్వాలు పెద్దఎత్తున టీకా వేయించుకోవాలనే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందరిలాగే జూన్ 26న మధురాబాయి ఓ కేంద్రానికి వెళ్లి కొవిషీల్డ్ టీకా తీసుకుంది. చిత్రంగా ఆ మరునాటి నుంచే ఆమెకు కళ్లు కనిపించడం మొదలయ్యాయట. ఇదే విషయం అందరికీ చెప్పడంతో చుట్టుపక్కల వాళ్లంతా దీన్నో వింతగా భావించడం మొదలుపెట్టారు. కొందరు కంటి వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమెకు పాక్షికంగా చూపు రావడానికి వ్యాక్సినా? లేక మరేదైనా కారణముందా అనేది తేల్చడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారట.