సికింద్రాబాద్ పాట్నీ- సుచిత చౌరస్తా , జూబ్లీ బస్‌స్టేషన్- ఓఆర్ఆర్ స్కైవేల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం
కానీ కేంద్ర ప్రభుత్వం రక్షణ స్థలాలివ్వకుండా సహాయనిరాకరణ చేస్తోంది
కేంద్రం నిరాకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుచిత్ర వద్ద సొంత నిధులతో స్కైవే చేపడుతుంది, బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: మహానగర అభివృద్ధిలో భాగంగా స్కైవేల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ స్థలాలపై నాలుగేళ్లుగా స్పష్టత ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుండడం విచారకరమని పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) పూర్తిచేసిన బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంగళవారం ఉదయం మంత్రులు కె.టి.రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. గత రెండేళ్లుగా బ్రిడ్జి పనుల్లో పాలుపంచుకున్న వనపర్తి జిల్లా మణిగల గ్రామానికి చెందిన శివమ్మ అనే కార్మికురాలి చేత మంత్రి కెటిర్ రిబ్బన్ కత్తిరింపజేసి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా శ్రమను గుర్తించి, కార్మికులను గుర్తించి వారికి గౌరవించుకోవడం ద్వారా మనకు మనం గౌరవించుకోవడమేనని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో స్కైవేల నిర్మాణానికి సిద్ధం….
అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్యాట్నీ నుంచి సుచిత్ర చౌరస్తా వరకు, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) తుర్కపల్లి వరకు స్కైవేల నిర్మాణానికి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉన్నామన్నారు. దురదృష్టవశాత్తు దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తుందని, ఈ నేపధ్యంలో వాటిని చేపట్టలేకపోతున్నామని మంత్రి కెటిఆర్ విచారం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ(డిఫెన్స్) భూములను అప్పగించే అంశంపై నాలుగు సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాని కారణంగా ఆ రెండు చోట్ల స్కైవేల నిర్మాణాల్లో జాప్యం జరుగుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికైనా కేంద్రం ముందుకు వచ్చి రక్షణ శాఖ స్థలాలను అప్పగిస్తే వెంటనే స్కైవేల నిర్మాణాలు చేపడతామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కేంద్రం ముందుకు రాని పక్షంలో సుచిత్ర సర్కిల్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు సిద్దమని మంత్రి ప్రకటించారు. అదేవిధంగా బాచుపల్లి, కుత్బుల్లాపూర్ రహదారుల విస్తరణ పనులను కూడా చేపడతామని మంత్రి కెటిఆర్ ప్రకటించారు.
మొదటి దశలో రూ.6వేల కోట్లతో అండర్‌పాస్‌లు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు లోబడి వ్యూహాత్మకం రహదారుల విస్తరణ కార్యక్రమం (ఎస్ఆర్డిపి) కింద రూ.30వేల కోట్ల ప్రణాళికలలో భాగంగా మొదటి దశలో రూ.6వేల కోట్లతో అండర్‌పాస్‌లు, బ్రిడ్జిల నిర్మాణాలు జరుగుతున్నాయని, కూకట్పల్లి నియోజక వర్గంలోనే వెయ్యి కోట్లకు పైగా వ్యయంతో రహదారుల విస్తరణ, అండర్‌పాస్ నిర్మాణాలు జరిగాయని, ఇంకా కొన్ని పనులు ఎస్ఆర్డిపి కింద జరుగుతున్నాయని మంత్రి వివరించారు. హైదరాబాద్ ప్రజలకు మరింత మరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏలు సంయుక్తంగా కలిసి మహానగరంలో బ్రహ్మండమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. భారత ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా ప్రారంభించుకున్న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్ రాం పేరును ఖరారు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.
మిగిలిన నిధులతో పరిసరాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు
బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను రూ.385 కోట్ల వ్యయంతో ప్రారంభించామని, స్థానిక ప్రజల కోరిక మేరకు రహదారుల విస్తరణను కొంత మేరకు తగ్గించుకోవడం వల్ల రూ.275 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన నిధులతో పరిసరాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అంతకు ముందు మంత్రి కెటిఆర్ తో పాటు అతిధులకు హెచ్ఎండిఏ సెక్రటరీ సంతోష్ సాధాంగా ఆహ్వానం పలికారు. బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిని మంత్రి కెటిఆర్ శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కె.నవీన్‌కుమార్, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఫతేనగర్ కార్పొరేటర్ పి.సతీష్‌గౌడ్, బాలానగర్ కార్పొరేటర్ ఎ.రవీందర్‌రెడ్డిలతో పాటు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణానికి రెండేళ్లుగా రాళ్లెత్తిన కూలీ చేత బాలానగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభింప చేస్తున్న మంత్రి కెటిఆర్
బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఓ సాధారణ కూలీకి అరుదైన గౌరవం లభించింది. రాళ్లు ఎత్తిన చేతులకు అపురూప భాగ్యం కలిగింది. ఎవరూ ఊహించని విధంగా ఓ మహిళ చేత ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేయించి పేదలు, మహిళల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ చాటిచెప్పారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా రిబ్బన్ కటింగ్ మంత్రి కెటిఆర్ ఓ కూలీతో చేయించారు. ఆ కూలీ ఎవరో కాదు వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. ఆమె గత రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో పాలు పంచుకున్నారు. దీంతో శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకో వడంతో అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇవాళ లక్షలాది మంది కార్మికులు మన ప్రాజెక్టుల్లో నిమగ్నమై పనిచేశారని, వారిని గౌరవించుకోవాలన్న సిఎం కెసిఆర్ సూచనతో వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ అనే కూలీతో ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ చేయించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో పాలు పంచుకునే కూలీలను గౌరవించుకుంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.
KTR Speech after Balanagar Flyover Inauguration