మనతెలంగాణ/హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సిబిఐ సమయం కోరింది. దీంతో విచారణను ఈ నెల 13కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి శామ్యూల్‌ను తొలగించవద్దని సిబిఐ కోరింది. పయనీర్ హాలీడే రిసారట్స్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు సిబిఐ సమయం కోరింది. అలాగే పిఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సిబిఐ సమయం కోరింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఈ నెల 13కి కోర్టు వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసు విచారణ
ఓటుకు నోటు కేసును ఎసిబి కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణకు ఉదయ్ సింహా హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం టిపిసిసి చీఫ్, ఎంపి రేవంత్ రెడ్డి మాజీ గన్‌మెన్ల వాంగ్మూలాలను నమోదు చేసింది. కేసు నమోదైన సమయంలో రేవంత్ రెడ్డికి గన్‌మెన్లుగా ఉన్న డి.రాజ్ కుమార్, ఎస్.వెంకట కుమార్ సాక్షులుగా విచారణకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్లారో వారు కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.
చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు
ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆఫ్‌లైన్‌లో దాఖలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. ఈనెల 15న అందరూ వాదనలు వినిపించాలని ఇక సమయం కోరవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేష్ కౌంటర్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసిట్లు చెన్నమనేని రమేష్ తెలిపారు. చెన్నమనేని రమేష్ కౌంటర్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవాల్సింవుండగా సమయం కోరింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.
Minister Sabitha files discharge petition in Jagan Assets Case