దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తాజాగా ప్రకటించిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఏడో ర్యాంక్‌తో సిరీస్‌ను మొదలు పెట్టిన మిథాలీ చివరి వన్డే ముగిసే సమయానికి టాప్ ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం. వన్డే సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన మిథాలీ మూడేళ్ల తర్వాత మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మిథాలీ 762 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవలే టాప్5లో నిలిచిన మిథాలీ తాజాగా అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. సౌతాఫ్రికా బ్యాటర్ లిజెల్లి లీ రెండో, ఆస్ట్రేలియా స్టార్ అలీసా హీలీ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. టామీ బ్యూమౌంట్ (ఇంగ్లండ్), స్టెఫాని (విండీస్) టాప్5లో చోటు దక్కించుకున్నారు.
ఇక భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టాప్10లో తన స్థానాన్ని కాపాడుకుంది. మంధాన తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. ఇక బౌలింగ్ విభాగంలో జెన్ జొనాసెన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జొనాసెస్ 808 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఆస్ట్రేలియాకే చెందిన మెగాన్ షుట్ రెండో, సౌతాఫ్రికా బౌలర్లు కాప్, షబ్నమ్ ఇస్మాయిల్ మూడు, నాలుగు ర్యాంక్‌లను దక్కించుకున్నారు. ఇక భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి ఐదో ర్యాంక్‌ను కాపాడుకుంది. పూనమ్ యాదవ్ తొమ్మిదో ర్యాంక్‌కు ఎగబాకింది.