హైదరాబాద్: సింగరేణి కోల్‌మైన్స్ బిఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి సొంత గూటికి చేరుకోవడం హర్షణీయమని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో తన అనుచరులతో కలిసి సింగరేణి కోల్‌మైన్స్ బిఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి మల్లయ్యను మంత్రి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతీ కార్మికుడికి న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని, సిఎం కెసిఆర్‌తోనే సింగరేణి కార్మికులకు న్యాయం జరుగుతోందన్నారు. రాజకీయంగా కూడా సింగరేణి కార్మికులు చురుగ్గా పని చేయాలన్నారు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులున్న చిన్న చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, సింగరేణి కార్మికులు 25-30 నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తారన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బిజెపి పాలి రాష్ట్రాల్లో ఉన్నాయా? అని కెటిఆర్ ప్రశ్నించారు. కెసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి తెలంగాణలో ఎవరికి లేదన్నారు.
కొందరు సిఎం కెసిఆర్‌ను విమర్శస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను ప్రేమించడం కెసిఆర్‌ను చూసి విపక్ష నేతలు నేర్చుకోవాలన్నారు. దుబ్బాకాలో గెలవగానే బిజెపి నేతలు ఎగిరెగిరి పడ్డారని, నాగార్జున సాగర్‌లో బిజెపి అడ్రస్ గల్లంతైందని విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా బిజెపికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి సిటింగ్ సీట్‌ను టిఆర్‌ఎస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి బోర్లకుంట వెంకటేష్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రభుత్వ విప్‌లు బాల్కసుమన్, గువ్వల బాలరాజు, ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్, పెద్దపల్లి జడ్‌పి చైర్మన్ పుట్టా మధు, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.