Friday, November 1, 2024

సిఎం కెసిఆర్‌తో ఎల్ రమణ భేటీ..

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్‌తో టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ భేటి
సైకిల్ దిగి త్వరలో కారెక్కేందుకు రంగం సిద్ధం
పార్టీ మార్పుపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ త్వరలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును కలిశారు. ఈ సందర్భంగా టిడిపిని వీడే అంశంపై కెసిఆర్‌తో చర్చించారు. ఇందుకు సిఎం కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే టిడిపికి రమణ గుడ్‌బై చెప్పనున్నారు. అనంతరం సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ కండువ కప్పుకోనున్నారని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం శాసనసభాపక్షం(టిడిఎల్‌పి) అధికార టిఆర్‌ఎస్‌లో విలీనమైన విషయం తెలిసిందే. కాగా రమణ కూడా గుడ్‌బై చెబితే రాష్ట్రంలో టిడిపి ఇక పూర్తిగా కనుమరుగైనట్టేనని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో టిడిపి రోజురోజుకు మరుగున పడుతుండడం, ఇంకా అదే పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారనుందని రమణ భావిస్తున్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడు తెలంగాణలో పార్టీ పటిష్టతపై అంతగా దృష్టి సారించడం లేదు.

దీని కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు నేతలు సైకిల్ దిగి తలోదారిన వెళ్లిపోయారు. ఫలితంగా పలు జిల్లాలో టిడిపికి నాయకులు, కార్యకర్తల దిక్కుకూడా లేకుండా పోయింది. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం సైకిల్ పూర్తిగా కనుమరుగు అవుతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో జరిగిన పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సైకిల్ గుర్తుపై విజయాన్ని సాధించిన దాఖలాలు లేవు. ఇక పార్టీలో ఉన్న నేతలు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అడపా, దడపా నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మీడియా సమావేశాలను తు..తు మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజల సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం కూడా లేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో అసలు టిడిపి ఉందా? అన్న అనుమానం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రమణ కూడా సైకిల్ దిగేందుకు సిద్దమమయ్యారు. ఈ ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై రమణే స్వయంగా స్పందించి తాను పార్టీ మరడం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన వ్యవహారంపై టిడిపి అధిష్టానం సైతం గుర్రుగా ఉంటోంది. ఎప్పుడైనా ఆయన పార్టీ వీడడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబునాయుడు రమణను చాలా రోజులుగా దూరంగా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఫలితంగా ఆయన అప్పటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మెట్లు కూడా ఎక్కడం లేదు.
ఇదిలా ఉండగా రమణతో కొద్ది రోజులుగా టిఆర్‌ఎస్ నేతలు టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని టిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో కరీంనగర్ నుంచి మరో బిసి నాయకున్ని తీసుకునే ప్రయత్నంలోనే రమణకు గులాబీ పార్టీ గాలం వేసినట్లుగా తెలుస్తోంది. గతంలోఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి రమణ ఎంఎల్‌ఎగా ప్రాతినిథ్యం వహించారు.

Telangana TDP Chief L Ramana meet CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News