Saturday, November 23, 2024

రూ. 23,123 కోట్ల కొవిడ్ ప్యాకేజీ

- Advertisement -
- Advertisement -

Centre announces Emergency Package to fight Covid

రూ.లక్ష కోట్ల రైతు నిధి

కేంద్ర మంత్రి మండలి కీలక ఆమోదాలు

మోడీ మార్క్‌తో తొలిసారి భేటీ

న్యూఢిల్లీ: మోడీ సారథ్యపు మార్పులు చేర్పుల సరికొత్త కేబినెట్ తొలి భేటీ గురువారం ఇక్కడ జరిగింది. ఆరోగ్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం దక్కింది. కరోనా నివారణే లక్షంగా దేశంలో ఆరోగ్య , చికిత్స మౌలిక సదుపాయాల మెరుగుకు ఉద్ధేశించిన రూ 23,123 కోట్ల కొవిడ్ ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఇక అత్యంత కీలక నిర్ణయంగా రైతుల మౌలిక వసతుల నిధికి రూ.1 లక్ష కోట్ల కేటాయింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనూ హ్య మార్పుల తరువాత జరిగిన కేబినెట్ సమావేశంపై రాజకీయ వర్గాలలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వర్షాకాలం ఆగమనం, రైతులు దుక్కులు దున్నే తరుణం, మరో వైపు ఇప్పటికీ ఆగని రైతుల ఢిల్లీశివార్ల ఆందోళనలు నేపథ్యంలో వ్యవసాయ రంగంపై కేంద్ర మంత్రి మండలి సమీక్ష జరిపింది. సాధారణంగా ప్రతి బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. కీలక నిర్ణయాలకు ఆమోద ప్రక్రియ ఉంటుంది. అయితే ఈసారి బుధవారం కేంద్ర కేబినెట్ పునర్వస్థీకరణ జరగడంతో, కొత్తరూపురేఖల కేబినెట్ భేటీని మరుసటి రోజుకు (గురువారానికి) మార్చారు. ఇక వ్యవసాయ రంగంతో పాటు ఆరోగ్య చికిత్స రంగాలపై కేబినెట్ మరింత ప్రాధాన్యతా క్రమంతో దృష్టి సారించింది. కరోనా వైరస్ పరిస్థితి, రోగుల సంఖ్యలు, చికిత్స విధానాలు, ఇప్పుడు ప్రపంచస్థాయిలో ముప్పుగా మారిన డెల్టా వేరియంట్‌తో ఇండియాలో తలెత్తే పరిస్థితిపై కొత్త ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయా కేబినెట్‌కు వివరణ ఇచ్చారని వెల్లడైంది.

దేశంలో కొవిడ్ నియంత్రణకు కేంద్రం కేటాయించిన అత్యవసర సహాయక ప్యాకేజీ వివరాలను కేబినెట్‌కు ఆరోగ్య మంత్రి తెలియచేశారు. ఈ సహాయ పథకంరూ 23,123 కోట్ల వరకూ ఉంటుంది. కొవిడ్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీలలో ఇది రెండోది అని మంత్రి తెలిపారు. ఆరోగ్య చికి త్స విధానాలకు ఇది ఉద్ధీపనగా ఉంటుందన్నారు. కరో నా రెండో వేవ్ సోకుతుందనే భయాందోళనల నడుమ దేశంలో చికిత్స, వైరస్ నియంత్రణల విషయంలో ఎటువంటి వనరుల కొరత ఉండకుండా చేసేందుకు ఈ భారీ ప్యాకేజీని ప్రకటించారని మంత్రి తెలిపారు. ఆరోగ్య చికిత్స వ్యవస్థలను మరింతగా పటిష్టం చేసేందుకు ఈ సాయం ఉపయుక్తం అవుతుంది. ప్రజలకు ఆరోగ్య కల్పనలో వనరుల కొరత లేకుండా చేయడం, వైద్య సౌకర్యాల కొదవ రాకుండా చూడటం కీలక అంశం అని మంత్రి తెలిపారు. ఢిల్లీ డాక్టర్ హర్షవర్థన్ చేతుల్లో నుంచి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పుడు మాండవీయకు చేరింది. ఈ భారీ నిధిని కేంద్రం, రాష్ట్రాలు అత్యయిక ఆరోగ్య పరిస్థితుల నడుమ సంయుక్తంగా వినియోగించుకుంటాయి. నిధిలో రూ.15 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తుంది. మిగిలిన రూ.8 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయిస్తారని మంత్రి తెలిపారు. కొవిడ్ అత్యయిక పరిస్థితి సహాయక నిధిని ఇటీవలే దీనికి సంబంధించి ప్రకటన వెలువడిందని, దీనిని కార్యాచరణలోకి పెట్టి, దశల వారిగా వచ్చే తొమ్మిదినెలల పాటు ఖర్చుచేస్తారని మంత్రి విలేకరులకు తెలిపారు. పిల్లలపై కొవిడ్ ప్రభావం ఏ విధంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి? దీనిని ముందుగానే నియంత్రించడం వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించినట్లు వివరించారు. దేశంలో మరో 20వేల ఐసియూ పడకలు అందుబాటులోకి వస్తాయి, టెలీ మెడిసిన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. దీనితో మౌలిక చికిత్స జరుగుతుంది.
దేశవ్యాప్తంగా చిన్నపిల్లల చికిత్సా కేంద్రాలు
బాల్య దశలోని వారిని థర్డ్‌వేవ్ కరోనా కాటేస్తుందనే విశ్లేషణలపై లోతుగా విశ్లేషణలు జరిపినట్లు మంత్రి విలేకరులకు తెలిపారు. దేశంలోని దాదాపు 736 జిల్లాల్లో పెడియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు.మొత్తం మీద ఎన్ని బాలల చికిత్సా కేంద్రాలు ఏర్పాటు అవుతాయనేది వివరించలేదు.
రైతులకు రూ.లక్ష కోట్ల నిధికి ఆమోదం
కేంద్రకేబినెట్‌లో మరో ప్రధాన అంశంగా వ్యవసాయ రంగ సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్లు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఆయన శాఖలో మార్పు జరగలేదు. రైతుల ప్రధాన సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. దేశంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉద్ధేశించిన రూ 1 లక్ష కోట్ల నిధి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తోమర్ వివరించారు.ఈ లక్ష కోట్ల నిధిని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఎపిఎంసి)ద్వారా రైతులకు సరైన సాయం కోసం వినియోగిస్తారు. ఇక దేశంలోని కొబ్బరి తోటల రైతులకు మేలు చేసే దిశలో కోకోనట్ బోర్డును పునర్వస్థీకరించే నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. కొబ్బరి సాగును మరింత మెరుగుపర్చేందుకు బోర్టు చట్టంలో సవరణలు చేస్తారు. సాగు పై అవగావహన ఉన్న వ్యక్తిని ఎంచుకుని వారికే కొబ్బరి బోర్డు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని తోమర్ తెలిపారు.
కొత్త వ్యవసాయ చట్టాలపై దిగులొద్దు..ఆందోళన విరమించి చర్చలకు రండి
కేంద్రం రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉందని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావు లేదని వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై అనవసర అపోహలు వద్దని, ఇప్పుడున్న ఎపిఎంసి వ్యవస్థకు ఎటువంటి ఢోకా లేదని తేల్చిచెప్పారు. ఎపిఎంసి వ్యవస్థకు అనుగుణంగా రైతులకు ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. దీనిని ఎత్తివేసే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర సహాయక నిధి నుంచి ఎప్పటికప్పుడు ఎపిఎంసికి కోట్లాది రూపాయలు అందుతూనే ఉంటాయని, దీనితో రైతాంగక్లిష్ట సమస్యల పరిష్కారానికి కృషి సాగుతుందని వివరించారు. కొత్త చట్టాలతో రైతులకు మేలు ఉంటుందని, వారికి మరింత బలం చేకూరేలా మార్కెటింగ్ కమిటీలను బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆందోళనలో ఉన్న రైతులను శాంతింపచేసే దిశలోనే ఈ కీలక కేబినెట్‌లో దీనిపై తగు విధంగా చర్చ జరిగినట్లు వెల్లడైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని, చట్టాలు మరింత ప్రయోజనాలకు వీలుగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రైతులు ఆందోళనను విరమించుకుని చర్చలకు రావాలనికోరారు.
జాడ లేని జవ…కన్పించని ప్రసాద్: కేబినెట్ వివరణలలో కొత్తదనం
సాధారణంగా ప్రతిసారి కేబినెట్ భేటీకాగానే వివరాలను రవిశంకర ప్రసాద్ కానీ ప్రకాశ్ జవదేకర్ కానీ విలేకరులకు తెలియచేయడం జరుగుతుంది. అయితే నిన్నటి కేబినెట్ మార్పుల్లో వీరిపై వేటు పడింది. దీనితో రెగ్యులర్ విలేకరులకు ఈసారి ఈ భేటీ కొత్తదనం కన్పించింది. దీనినే కొందరు ప్రస్తావించారు. ఈసారి రెండు అంశాలపై కీలక సమీక్ష జరిగిందని కొత్త ఆరోగ్య మంత్రి, పాత వ్యవసాయ మంత్రి విలేకరులకు వేర్వేరుగా తెలిపారు. ఎప్పుడు ప్రసాద్, జవదేకర్‌ల ముఖాలు పరిచయం అని, ఈసారి ఇది తొలి ముఖ పరిచయంగా ఉందని, రానురాను ఇది మామూలు అవుతుందని పాత్రికేయలు వ్యాఖ్యానించారు.

Centre announces Emergency Package to fight Covid

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News