టిడిసి బోర్డులో నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : పర్యాటకులను ఆహ్లాద పరిచేవిధంగా రాష్ట్రంలో చేపట్టిన పలు నిర్మాణ పనులు పూర్తయినందున ఎకో టూరిజం సర్క్యూట్లను పారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ తీర్మానించింది. శుక్రవారం నాడు టిఎస్టిడిసి 28వబోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎకో టూరిజం సర్య్కూట్ కింద సోమశిల, ఉమామహేశ్వరం, మన్ననూర్ ,ఈగలపెటం ప్రాంతాలు, ట్రైబల్ సర్కూట్ కింద గట్టమ్మ తడ్వాయ్, మేడారం, బొగత వాటర్‌ఫాల్, మల్లూర్ ప్రాంతాల నిర్వహణకు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని బోర్డు తీర్మానించింది. పర్యాటక సందర్శనకు వచ్చే వారికి అనుకూలంగా కంప్యూటరైజ్డ్ టిక్కెట్ సిష్టంను అన్ని యూనిట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల వేతన సవరణ అములులో భాగంగా సిబ్బంది జీతాలను 30శాతం పెంచేందుకు తీర్మానించింది. కాంటాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పెంపుదల వర్తింప చేయాలని బోర్డు తీర్మానించింది. హరిత ప్లాజాలో జరిగిన బోర్డు సమావేశంలో సభ్యులు కె.శ్రీనివాసరాజు,బి.మనోహర్ , సివి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.