ఎలాంటి షరతులు లేకుండా గులాబీ పార్టీలో చేరుతున్నా
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేణ కార్యక్రమాలు భేష్
సిఎం కెసిఆర్ నేతృత్వంలో అనతికాలంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది
మన తెలంగాణ ప్రతినిధితో టిటిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ
హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌లో చేరేందుకు తాను ఎలాంటి షరతులు పెట్టలేదని టిటిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమణ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్టం అనతి కాలంలోనే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు చేయూతను అందించాలన్న లక్షంతోనే గులాబీ కండువ కప్పుకునేందుకు సిద్ధమయినట్లు ఆదివారం ఆయన మన తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ వెల్లడించారు.
సిఎం కెసిఆర్ తనకు ఎంఎల్‌సి పదవి లేదా హుజురాబాద్ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉపఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తుత్తిదేనని అన్నారు. అయితే తన సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలని సిం కెసిఆర్ భావిస్తే…ఆ విధంగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రమణ తెలిపారు. తనకు మొదటి నుంచి షరతులు పెట్టి రాజకీయాలు చేయడం ఇష్టం లేదన్నారు. పార్టీ అధిష్టానం చెప్పినట్లుగా నడుచుకోవడమే తనకు తెలిసిన రాజకీయమన్నారు. తెలుగుదేశంలో కూడా చంద్రబాబుతో కలిసి కొన్నేళ్ల పాటు రాజకీయ ప్రయాణం చేశానని అన్నారు. అయితే ఏ నాడు పార్టీకీ వెన్నుపోటు పొడవ లేదన్నారు.
అలాగే పార్టీ అధిష్టానం కట్టబెట్టిన బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేసేందుకు చివరి క్షణం వరకు యత్నించానని ఆయన తెలిపారు. అలాగే టిఆర్‌ఎస్‌లో కూడా భవిష్యత్తులో సిఎం కెసిఆర్, పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కెటిఆర్ చెప్పిన విధంగా నడుచుకుంటానని రమణ తెలిపారు. వారిచ్చే సూచనలు, సలహాలు పాటించి క్రమశిక్షణగల నాయకుడిగా టిఆర్‌ఎస్‌లో కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో టిడిపి మనుగడ చాలా కష్టసాధ్యమన్నారు. అందువల్ల తనతో పాటు పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా ఆ పార్టీకి రాజీనామ చేసి తనతో పాటు టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
రేపు కెటిఆర్ చేతుల మీదగా ప్రాథమిక సభ్యత్వం
సోమవారం పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కెటిఆర్ చేతుల మీదుగా రమణ టిఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు. అనంతరం అనంతరం ఈ నెల 16న తన సహచరులతో కలిసి ఆ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి గతంలో శాసనసభ్యుడిగా గెలిచిన ఆయన ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో టిఆర్‌ఎస్‌లోకి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.