కాబూల్/న్యూఢిల్లీ: అఫ్ఘనిస్థాన్‌లో మరిన్ని ప్రాంతాలు తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చాయి. దీనితో పరిస్థితిని గమనించి కాందహార్ నుంచి 50 మంది దౌత్యసిబ్బందిని, భద్రతా బలగాలను భారత్ ఉపసంహరించుకుంది. అమెరికా ఆధ్వర్యపు సంకీర్ణ సేనల దశలవారి అఫ్ఘన్ నిష్కృమణ జోరందుకొంటోంది. ఈ దశలోనే తిరిగి తాలిబన్లు వివిధ ప్రాంతాలలో తమ ప్రాబల్యం పెంచుకుంటున్నారు. ప్రత్యేకించి దక్షిణాది నగరం కాందహార్ సమీప ప్రాంతాలు అనేకం తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాయి. దీనితో భారతదేశం వెంటనే స్పందించింది. కాందహార్‌లోని తమ దౌత్య , సైనిక సిబ్బందిని వెనకకు రప్పించే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్కడికి హుటాహుటిన భారతీయ వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానాన్ని శనివారం పంపించారు.
ఈ ప్రాంతంలో కొందరు భారతీయ దౌత్యవేత్తలు కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఇక ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు సిబ్బంది కూడా ఉంది. పశ్చిమ అఫ్ఘనిస్థాన్ ప్రాంతంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అక్కడి సిబ్బందిని వెనకకు రప్పిస్తున్నారు. అయితే కాబూల్‌లోని ఎంబస్సీని కానీ, కాందహార్‌లోని కాన్సులేట్‌ను కానీ పూర్తిస్థాయిలో మూసివేసే ప్రసక్తే లేదని ఇటీవలే భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని, అక్కడి పరిణామాలు భారతీయులపై ఎటువంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని బేరీజు వేసుకుని తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.